కాంగ్రెస్ పంజాబ్ సీఎం కుర్చీకి రూ. 500 కోట్లు

కాంగ్రెస్ పంజాబ్ సీఎం కుర్చీకి రూ. 500 కోట్లు

“పంజాబ్‌లో సీఎం అభ్యర్థిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిస్తే ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారు. కానీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి మా వద్ద రూ.500 కోట్లు లేవు” అంటూపంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, ఆ పార్టీ నాయకురాలు నవజ్యోత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 కోట్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతారంటూ ఆమె పరోక్షంగా కాంగ్రెస్ నాయకత్వంపై విసుర్లు విసిరారు.

తమ వద్ద డబ్బు లేదని, అయితే అవకాశం ఇస్తే పంజాబ్‌ను ‘స్వర్ణ రాష్ట్రంగా’ మార్చగలమని ఆమె చెప్పారు. ఎవరైనా డబ్బు డిమాండ్ చేశారా? అని అడిగినప్పుడు, ఎవరూ డిమాండ్ చేయలేదని అంటూనే అయితే ‘రూ.500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు’ అని మరోసారి ఆమె స్పష్టం చేశారు. పంజాబ్‌ గవర్నర్‌ గులాబ్ చంద్ కటారియాను నవజ్యోత్ కౌర్ కలిశారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ఇతర సమస్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పంజాబ్‌ను మెరుగుపరచడానికి ఆ (సీఎం) అధికారాన్ని నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తారని, బంగారు రాష్ట్రంగా మారుస్తారని నవజ్యోత్ కౌర్  ఈ సందర్భంగా తెలిపారు. 

అయితే పంజాబ్ కాంగ్రెస్‌లో ‘అంతర్గత కలహాలు’ ఉన్నాయని ఆమె విమర్శించారు. ఇప్పటికే ఐదుగురు నాయకులు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారని పేర్కొంటూ దీంతో సిద్ధూను వారు ముందుకు రానివ్వరని ఆమె చెప్పారు. ‘కాంగ్రెస్‌ను ఓడించాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారు (హైకమాండ్) దీనిని అర్థం చేసుకుంటే, అది వేరే విషయం’ అని ఆమె పార్టీ నాయకత్వంపై చురకలు అంటించారు.

మరోవైపు తన భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కాంగ్రెస్‌తో, ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాతో బలమైన అనుబంధం ఉన్నదని నవజ్యోత్ కౌర్ తెలిపారు. తిరిగి బీజేపీలో ఆయన చేరుతారా? అని అడిగినప్పుడు ఆయన తరుఫున ఆ విషయాన్ని తాను చెప్పలేనని చెప్పారు. అయితే సిద్ధూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి వస్తారని తెలిపారు.

‘లేకపోతే ఆయన మంచిగా డబ్బు సంపాదిస్తున్నారు. ఆయన సంతోషంగా ఉన్నారు’ అని ఆమె పేర్కొన్నారు. కాగా, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ అయిన సిద్ధూ చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేయలేదు.