తెలంగాణలో అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న “మహా ధర్నా” రాబోయే రోజుల్లో “మహా ధర్మయుద్ధం”గా మారుతుందని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు హెచ్చరించారు. ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్‌లో ఆదివారం “ప్రజాద్రోహ దినోత్సవం” పెడుతూ నిర్వహించిన మహా ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ, హిందూ దేవుళ్లను అవమానించే, యువత భవిష్యత్తుతో ఆడుకునే, మహిళల భద్రతను తుంగలో తొక్కే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో ఎందుకు కొనసాగించాలని తెలంగాణ ప్రజలు ఇప్పుడు తమను తాము ప్రశ్నించుకుంటున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఓబిసి మోర్చా చీఫ్ డాక్టర్ కె లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, బిజెపిఎల్పి నాయకుడు ఎ మహేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన రేవంత్ రెడ్డి రెండేళ్ల వాగ్దానాల ఉల్లంఘన పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేయడం ఈ నిరసనల లక్ష్యం. గత ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ పార్టీ ఆరు భరోసాలు, 420 హామీలతో ప్రజలను వంచింది ఒక్క హామీ లేదా వాగ్దానం కూడా అమలు కాలేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమవడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పదవి నుంచి తొలగించబడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను అమ్మే అంశాన్ని లేవనెత్తుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూములను వేలం వేసే విధానంతో ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫార్మా సిటీ ముసుగులో లఘెర్ల వంటి ప్రాంతాలలో రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ రైతులు తిరుగుబాటు చేసినప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత ఎదురైందని గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక భూములను భారీ స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రైవేట్ భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు దారాదత్తం చేస్తుందని ఆయన మండిపడ్డారు.
మత రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మూడు కోట్ల మంది దేవుళ్లు ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి ముగ్గురే దేవుళ్లని.. వారే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలని రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు పెరుగుతున్నాయని, దేశ ద్రోహులను పోషిస్తుందంటూ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ నక్సలైట్లను కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని విమర్శించారు.
రైజింగ్ తెలంగాణ.. డ్రగ్స్ కల్చర్‌గా మారిపోయిందని, రైజింగ్ తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందంటూ డా. లక్ష్మణ్ ఆరోపించారు. పట్టపగలే పోలీసులను కాల్చి పడేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని తెలిపారు. పోలీసులకే దిక్కు లేదు, లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గన్, డ్రగ్స్, ఆన్ లైన్ గేమ్, ల్యాండ్ మాఫియా కల్చర్లలో రాష్ట్రం కూరుకుపోయిందని చెబుతూ రైజింగ్ తెలంగాణ కాదు ఇది అవినీతి తెలంగాణ అంటూ ఆయన స్పష్టం చేశారు.

More Stories
సరిహద్దులకు కనెక్టివిటీతోనే ఆపరేషన్ సిందూర్ విజయం
పుతిన్ కు `రెడ్ కార్పెట్’… ఇప్పుడు జెలెన్స్కీ కోసం ఎదురు చూపు
పవన్ కు ఉడిపి పీఠాధిపతి ’అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు