బీఆర్ఎస్ పార్టీ పదేండ్లు ఎలా పాలన చేసిందో ఒక శాతం అటు ఇటు కాంగ్రెస్ సర్కారు కూడా అదే పాలన చేస్తుందని, అదే రకమైన అవినీతి, అదే రకమైన అక్రమాలు ఉన్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్సించారు. ఇందులో తేడా ఏముందంటే. అప్పుడు కేంద్రీకృత అవినీతి ఉంటే, ఇప్పుడు వికేంద్రీకృతి అవినీతి కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు.
నాడు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు దుకాణాలు తెరిచి మాస్ కరప్సన్ కు పాల్పడుతున్నారని నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ విమర్సించారు. మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయంటే, మంత్రుల మధ్య పంపకాల చర్చలు జరుగుతున్నాయని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని వెల్లడించారు.
మంత్రివర్గ సమావేశాల కూడా మంత్రుల మధ్య సఖ్యత కుదర్చడం కోసమే పెడుతున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయని చెబుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించారని, ఈరోజు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నదని ఆయన గుర్తు చేశారు.
“నేను రేవంత్ రెడ్డికి ఒక్కటే సవాల్ చేస్తున్నాను. మీరు ఎన్నికల ముందు ప్రతి ఊరికి వెళ్లి దేవుళ్లపై ఒట్లు వేస్తూ అధికారంలోకి వస్తే.. వారిని అరెస్ట్ చేస్తం, వాళ్ల అవినీతి కక్కిస్తం అని హామీ ఇచ్చారు కదా? మరి రెండేండ్లలో ఏం చేశారని నేను ప్రశ్నిస్తున్నా. ఉచిత బస్సు, సన్నబియ్యం పేరు చెప్తున్నారు. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వమే రూ.43 ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ.15 మాత్రమే సర్దుతున్నది. ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం లక్షా యాభైవేలు ఇస్తున్నది. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తానన్న సాయం ఇవ్వలేదు” అని ఆయన వివరించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి అమలు కావడం లేదని, పంట బోనస్ ఇస్తామని మోసం చేశారని పేర్కొంటూ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఈ రెండేండ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. సింగరేణి భూముల నుంచి మొదలు హైటెక్ సిటీ భూముల వరకు విపరీతమైన అక్రమ భూదందా నడుస్తున్నదని ఆయన ఆరోపించారు.
గతంలో కేటీఆర్ ఎలాగైతే కేంద్రీకృతమైన వసూళ్లకు పాల్పడ్డాడో ల్యాండ్ బిజినెస్ గానీ, రియలెస్టేట్ లో గానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు అలాగే దందాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో రియలెస్టేట్ కుప్పకూలిపోయిందని పేర్కొంటూ కృత్రిమ వేలంలు పెట్టి రియలెస్టేట్ వ్యాపారం పెరిగిందని చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

More Stories
బీజేపీ సర్పంచ్ అభ్యర్థినిపై కాంగ్రెస్ గుండాల దాడి
విజయోత్సవాలు జరుపుకొనేందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలి
బిజెపి మహాధర్నా పోస్టర్ విడుదల