ఆపరేషన్ సిందూర్ సమయంలో సైనికదళాలు ఎంతో చేయగలిగేవని కానీ సంయమనం పాటించి నిర్దేశిత లక్ష్యసాధన కోసం ప్రతిస్పదించినట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం లేహ్ లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) కొత్తగా పూర్తి చేసిన 125 ప్రాజెక్టులకు ఆయన ప్రారంభిస్తూ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఈ ప్రాజెక్టులు నిదర్శనమని చెప్పారు.
సరిహద్దు ప్రాంతాల రోడ్లు జాతీయ భద్రతకు జీవనధారలని రక్షణమంత్రి అభివర్ణించారు. సరిహద్దు ప్రాంతాల్లో రికార్డ్ సమయంలో పూర్తిచేసిన ఈ ప్రాజెక్టులు, వికసిత్ భారత్ సంకల్పానికి, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనటానికి నిదర్శనమని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం వల్లనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు.
“కనెక్టివిటీ పెరగటం, సైనికదళాలను సరైన సమయానికి రవాణా చేయటం వల్లనే అంతపెద్ద ఆపరేషన్ సాధ్యమైంది. సరిహద్దు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరగటం వల్ల ఆపరేషన్ సిందూర్‌కు చరిత్రాత్మక విజయం లభించింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సైనికదళాలు, పాలనా యంత్రాంగంతో సరిహద్దు ప్రాంతాల ప్రజల సమన్వయాన్ని చూసే అవకాశం లభించింది. అది అపూర్వం” అని తెలిపారు.
సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రాజీ పడటం లేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సుమారు రూ.5,000 కోట్లు వెచ్చించిన ఈ ప్రాజెక్టులు సరిహద్దు రక్షణ, కనెక్టివిటీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. ఈ ప్రాజెక్టులు సైనికులు, బీఆర్ఓ సిబ్బంది అసాధారణ ధైర్యానికి, అంకితభావానికి నివాళి అని కొనియాడారు.
కఠినమైన వాతావరణంలోనూ, ఏ పరిస్థితుల్లోనైనా దేశం కోసం నిరంతరం కష్టపడే మన సైనికులు, బీఆర్ఓ ఉద్యోగుల ఆత్మ స్థైర్యమే భారత్‌ను కొత్త శిఖరాలకు చేరుస్తోందని చెప్పారు. ఒకేసారి 125 ప్రాజెక్టులను ప్రారంభించడం ఎప్పుడూ జరగని చారిత్రక మైలురాయి అని ఆయన చెప్పారు. ఈ ఏడాది మే నెలలో 50 ప్రాజెక్టులు అంకితం చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న రాజ్‌నాథ్, ఇప్పుడు ఆ సంతోషం రెట్టింపు అయ్యిందని వివరించారు.
ఈ 125 ప్రాజెక్టుల్లో ప్రత్యేకంగా లద్దాఖ్‌లో దార్బుక్-శ్యోక్-దౌలత్ బేగ్ ఓల్డి రోడ్డుపై నిర్మించిన 920 మీటర్ల పొడవైన శ్యోక్ టన్నెల్ ఒక ఇంజినీరింగ్ అద్భుతమని రక్షణ మంత్రి కొనియాడారు. ప్రపంచంలోనే అతి కఠినమైన భూభాగంలో నిర్మించిన టన్నెల్ ఏడాది పొడవునా కనెక్టివిటీని అందిస్తుందని తెలిపారు. భారీ మంచు, హిమపాతాలు, అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ఈ ప్రాంతంలో రక్షణ, ప్రత్యేకించి కఠినమైన శీతాకాలంలో వేగంగా సైనిక బలగాల రవాణా, భద్రతా సామర్థ్యాన్ని పలు విధాలుగా పెంచడానికి ఇవి తోడ్పడతాయని మంత్రి తెలిపారు.

More Stories
పుతిన్ కు `రెడ్ కార్పెట్’… ఇప్పుడు జెలెన్స్కీ కోసం ఎదురు చూపు
పవన్ కు ఉడిపి పీఠాధిపతి ’అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు
కాంగ్రెస్ పంజాబ్ సీఎం కుర్చీకి రూ. 500 కోట్లు