‘నేషన్ ఫస్ట్ పాలసీ’కి అనుగుణంగానే ఇవాళ్టి సంస్కరణలన్నీ ముందుకు సాగుతున్నాయని, తద్వారా భారత దేశం అభివ్రుదిని సాధిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మూడు రోజులపాటు ఢిల్లీలో జరిగిన 23వ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్-2025లో ముగింపు ప్రసంగం చేస్తూ అనిశ్చితి ప్రపంచంలో సంస్కరణల ఆధారిత ఆర్థిక ఎజెండా కారణంగా పురోగతికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా భారత్ నిలుస్తోందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా మందగమనం నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా ముందుకు వెళ్తోందని పేర్కొంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని ప్రధాని గుర్తు చేశారు. ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ చోదక శక్తిని నిరూపిస్తోందని, ఇది కేవలం నంబర్ మాత్రమే కాదని, మన బలమైన స్థూల ఆర్థిక వ్యవస్థకు సూచిక అని తెలిపారు.
గరిష్ఠ వృద్ధి, కనిష్ఠ ద్రవ్యోల్బణానికి ఇండియా మోడల్‌గా నిలుస్తోందని పేర్కొంటూ భారతదేశ అభివృద్ధిలో నారీ శక్తి పాత్ర ప్రశంసనీయమని మోదీ కొనియాడారు. ప్రతి రంగంలోనూ మన ఆడకూతుళ్లు తమదైన ముద్రవేసుకుంటున్నారని, ఆటంకాలు తొలగించుకుంటూ ముందుకు వెళ్తున్నారని, గగనతలంలోనూ తమ శక్తిసామర్థ్యాలను చాటుకుంటున్నారని ప్రశంసించారు.
రానున్న పదేళ్ల దేశాన్ని బానిస మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తం చేయాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వృద్ధిని “హిందూ వృద్ధి రేటు”గా అభివర్ణించి, మన నాగరికతను కించపరచడానికి ప్రయత్నించిన వారిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
“మీరు ఎవరైనా ఎప్పుడైనా హిందూ వృద్ధి రేటు అని అన్నారా? భారత్ 2 లేదా 3 శాంత వృద్ధి రేటును అందుకోవడానికి కూడా కష్టపడుతున్న సమయంలో కొందరు ఆ పదాన్ని ఉపయోగించారు. తద్వారా మొత్తం భారత సమాజాన్ని పేదరికానికి పర్యాయపదంగా మార్చారు. ఈ విధంగా భారత నెమ్మదిగా వృద్ధి చెందడానికి హిందూ నాగరికతే కారణమనే సందేశాన్ని ఉద్దేశపూర్వకంగా బలంగా చెప్పారు” అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచం మొత్తం అనిశ్చితులతో నిండిన తరుణంలో భారత్ ఆత్మవిశ్వాసంతో కళకళలాడుతోందని చెబుతూ ఆత్మవిశ్వాసం లేకుండా ఏ దేశం కూడా ముందుకు సాగదని, అందుకే భారత్ ప్రతి రంగంలో వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టి, గర్వంతో సరికొత్త విజయాలను లక్ష్యంగా చేసుకుంటోందని మోదీ పేర్కొన్నారు.
“వలసవాద మనస్తత్వం భారత్ తన లక్ష్యాలు సాధించకుండా ప్రధాన అడ్డంకిగా మారింది. అందుకే నేటి భారతదేశం ఈ మనస్తత్వం నుంచి విముక్తి పొందడానికి కృషి చేస్తోంది. అయితే ఈ వలసవాద మనస్తత్వం ఎంత దారుణంగా ఉందంటే, నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది భారత్‌ను ప్రపంచాభివృద్ధికి ఇంజిన్‌గా అభివర్ణిస్తున్నా, ఈ ఘనత గురించి గర్వంగా మాట్లాడేవారు చాలా తక్కువగా ఉన్నారని” ప్రధాని చెప్పారు.
“భారత్‌లో మానసిక బానిసత్వానికి బీజాలు వేసిన మెకాలే విధానానికి 2035 నాటికి 200 ఏళ్లు పూర్తి అవుతాయి. అంటే మనకు మరో 10 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 10 పదేళ్లలోనే మనమందరం కలిసి మన దేశాన్ని ఈ బానిస మనస్తత్వం నుంచి విముక్తం చేయాలి” అని మోదీ స్పష్టం చేశారు.

More Stories
మోదీ- పుతిన్ భేటీతో కొత్త స్థాయికి భారత్- రష్యా బంధం
జ్ఞాన్వాపి మసీదు, కృష్ణజన్మభూమి వైపు యోగి?
ఆదివారం రాత్రిలోగా రీఫండ్ చేయాలి