పార్లమెంటు శీతాకాల సమావేశాల వేళ సోమవారం లోక్‌సభలో జాతీయ గేయం వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరగనుంది. వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఈ చర్చను మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక చర్చను ముగించే ప్రసంగాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేస్తారు.
వందేమాతరంపై లోక్‌సభలో చర్చ కోసం మొత్తం 10 గంటల సమయాన్ని కేటాయించారు. ఇందులో 3 గంటల సమయాన్ని అధికార ఎన్‌డీఏ కూటమికి కేటాయించడం గమనార్హం. లోక్‌సభలో ప్రత్యేక చర్చ సందర్భంగా వందేమాతరంతో ముడిపడిన కీలకమైన చారిత్రక విశేషాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. వందేమాతరంపై లోక్‌సభలో జరిగే ప్రత్యేక చర్చలో కాంగ్రెస్ తరఫున 8 మంది ఎంపీలు ప్రసంగించనున్నారు.
ఈ జాబితాలో గౌరవ్ గొగోయ్ (విపక్ష ఉపనేత), ప్రియాంకాగాంధీ, దీపేందర్ హుడా, బిమల్ అకోయిజం, ప్రణితి షిండే, ప్రశాంత్ పదోల్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, జ్యోత్స్న మహంత్ ఉన్నారు. వందేమాతరంపై మంగళవారం రోజు రాజ్యసభలోనూ ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ చర్చను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆయన తర్వాత కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, రాజ్యసభ అధికార పక్షం నేత జేపీ నడ్డా ప్రసంగిస్తారు. డిసెంబరు 1న మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 19 వరకు కొనసాగుతాయి.
వందేమాతరం 150 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆ జాతీయ గేయం స్మారకోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 7న ఢిల్లీలో ప్రారంభించారు. బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతర గేయం తొలిసారిగా 1875 సంవత్సరం నవంబరు 7న ‘బంగ దర్శన్’ అనే సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. అనంతరం ఆ గేయాన్ని తన నవల ‘ఆనంద్ మఠ్’లో బంకిమ్ చంద్ర ఛటర్జీ చేర్చారు. ఈ నవల 1882లో ప్రచురితమైంది.
వందేమాతరం గేయాన్ని సంగీతపరంగా స్వరపర్చిన వ్యక్తి జాదూనాథ్ భట్టాచార్య. 1896లో కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం వేదికగా తొలిసారిగా వందేమాతర గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. దీంతో ఆ గేయానికి ప్రజల్లో క్రేజ్ పెరిగింది. తదుపరిగా భారత స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం కీలక భాగంగా మారింది. దేశ ప్రజల్లో దేశభక్తిని రగిల్చే మహత్తర అస్త్రంగా అవతరించింది.
మంగళ, బుధవారాల్లో లోక్‌సభలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ జాబితాలో ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వంటి టాపిక్స్ ఉన్నాయి. ఎన్నికల సంస్కరణలపై బుధ, గురువారాల్లో రాజ్యసభలో చర్చ జరగనుంది. బిహార్‌లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఎస్‌ఐఆర్‌పై విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ప్రధానంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రక్రియలో తాము గుర్తించిన లోపాలను లోక్‌సభలో ప్రస్తావించే ఛాన్స్ ఉంది.

More Stories
మోదీ- పుతిన్ భేటీతో కొత్త స్థాయికి భారత్- రష్యా బంధం
‘నేషన్ ఫస్ట్ పాలసీ’కి అనుగుణంగానే సంస్కరణలు
జ్ఞాన్వాపి మసీదు, కృష్ణజన్మభూమి వైపు యోగి?