భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పాక్ ఆర్మీనే కారణం

భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పాక్ ఆర్మీనే కారణం

భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పాక్ ఆర్మీనే కారణమని, పాక్ ఆర్మీ భారత్‌పై సైద్ధాంతిక శత్రుత్వానికి పాల్పడుతోందన్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విమర్శించారు. శనివారం ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి మాట్లాడుతూ పాక్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా దానిని ఎలా ఎదుర్కోవాలనేది న్యూఢిల్లీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. 

‘ఉగ్రవాదం, ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడం వంటివి చూసినప్పుడు వారు ఇండియాపట్ల శత్రుత్వ విధానాన్ని అనుసరించడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా చేస్తున్నదెవరు? ఆర్మీనే’ అని జైశంకర్ చెప్పారు. అయితే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్‌ గురించి మాట్లాడుతూ, టెర్రరిస్టుల్లో మంచి టెర్రరిస్టులు, చెడు టెర్రరిస్టులు ఉండనట్టే మంచి మిలటరీ నాయకులు, చెడ్డ మిలటరీ నాయకులు అని ఉండరని ఆయన ఎద్దేవా చేశారు. 

ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడుతూ, భారత్ నిర్దిష్ట నియమాలు, నిబంధల కింద ఆపరేషన్ చేపట్టిందని, ఎలాంటి చర్య తీసుకున్నా దేశానికి, దేశ ప్రజలకు, మీడియాకు, సివిల్ సొసైటీకి జవాబుదారీగా నిలిచిందని చెప్పారు. ప్రపంచం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా న్యూఢిల్లీ-మాస్కో సంబంధాలు చిరకాలంగా స్థిరంగా ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. వేరే దేశంలో ఇండియా సంబంధాలను వీటో చేసే హక్కు ఏ దేశానికీ లేదని స్పష్టం చేశారు. 

పుతిన్‌ ఉన్నత స్థాయి పర్యటన అమెరికాతో భారత్ సంబంధాలను చిక్కుల్లో నెట్టే అవకాశాలపై అడిగినప్పుడు, వీలైనన్ని ఎక్కువ దేశాలతో సంబంధాలు కొనసాగించడం ఇండియాకు చాలా కీలకమని, ప్రపంచంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎవరితో సంబంధాలు కొనసాగించాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ భారత్‌కు ఉందని మంత్రి సమాధానమిచ్చారు.

“గత 70-80 ఏళ్లుగా ప్రపంచం ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. కానీ భారత్, రష్యా మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. చైనా లేదా యూరప్‌తో రష్యా సంబంధాల్లో ఆటుపోట్లు తలెత్తాయి. దౌత్యం అంటే మరొకరిని సంతోషపెట్టడం కాదు” అని వివరించారు. వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని జైశంకర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. యూఎస్‌తో వాణిజ్యం అనేది చాలా ముఖ్యమైన అంశమని, సహేతుకమైన నిబంధనలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రయోజనాలు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.