జ్ఞాన్‌వాపి మసీదు, కృష్ణజన్మభూమి వైపు యోగి?

జ్ఞాన్‌వాపి మసీదు, కృష్ణజన్మభూమి వైపు యోగి?

తన హయాంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టి, పూర్తి చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ తర్వాత వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు వివాదం, మధురలోని కృష్ణజన్మభూమి వివాదం వైపు అడుగులు వేస్తున్నారా? అంటే ఆయన నర్మగర్భమైన సమాధానం ఇచ్చి ఆసక్తి కలిగించారు.  తాము అన్ని ప్రాంతాలకు చేరుకుంటామని, ఇప్పటికే చేరుకున్నామని ఆదిత్యనాథ్ సమాధానమిచ్చారు.

ప్రతి సమాజం తమ వారసత్వాన్ని గర్వకారణంగా భావిస్తుందని, తమ ప్రయత్నాలు ఆ దిశగానే ఉంటాయని చెప్పారు.  శనివారం ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, రెండు సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా తన హయాలో జరిగిన రామమందిర శంకుస్థాపన, నిర్మాణంతో పాటు గత వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామాలయంపై ధర్మ ధ్వజ స్థాపన చేయడం చిరకాలం తనకు గుర్తుండిపోతాయని చెప్పారు. 

అయోధ్య రామాలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తాము రుణపడి ఉంటామని, ఈ రోజు (డిసెంబర్ 6) చాలా కీలకమైన రోజని చెప్పారు. వివాదాస్పద కట్టడం (బాబ్రీ మసీదు) తొలగించామని, తద్వారా దేశ సమున్నత వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు మార్గం సుగమమైందని పేర్కొంటూ భవిష్యత్తులో ఏది జరిగినా ఇదే తరహాలో తాము కీలక పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్ అభివృద్ధి రోడ్‌మ్యాప్‌పై అడిగిన ప్రశ్నకు యోగి సమాధానమిస్తూ, 2027 నాటికి భారత్ 5 ట్రిలయన్ డాలర్లు (5 లక్షల కోట్లు), 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల (30 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించారని, దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అభివృద్ధితోనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. 

ఇందుకు అవసరమైన విజన్ డాక్యుమెంట్ కోసం గత ఆగస్టులో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఏకబికిన 27 గంటల పాటు చర్చించామని గుర్తు చేశారు. 2029-30 నాటికి ఉత్తరప్రదేశ్ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు, 20467 నాటికి 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్ తప్పనిసరిగా ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

గత మూడేళ్లలో సాధించిన వృద్ధిని తీసుకుంటే తప్పనిసరిగా అభివృద్ధి భారత్-అభివృద్ధి ఉత్తరప్రదేశ్, స్వయం సమృద్ధి భారత్-స్వయం సమృద్ధి ఉత్తరప్రదేశ్ సాధించగలమని తాను నమ్మతున్నట్టు యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో పెట్టుబడులకు అర్థం ఉండేది కాదని, వ్యక్తికి భద్రత లేనప్పుడు పెట్టుబడులు ఎలా భద్రంగా ఉంటాయని యోగి ప్రశ్నించారు. 

పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు నేరాలు, నేరగాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనే సహించేది లేదంటూ జీరో టాలరెన్స్ విధానాన్ని తీసుకువచ్చామని, ఇవాళ మెరుగైన శాంతిభద్రతల పరిస్థితితో తాను సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. తమ ప్రభుత్వం మౌలిక వసతులపై దృష్టి సారించిందని, ఈ దిశగా మెట్రో, ఎక్‌ప్రెస్‌వేస్, విమానాశ్రయాల్లో ప్రగతి సాధించామని తెలిపారు. 

దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం నొయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను రాబోయే రెండు నెలలో ప్రారంభించనున్నామని ఆదిత్యనాథ్ వెల్లడించారు.   వీటితో పాటు అర్జనైజేషన్‌పై దృష్టి పెట్టామని, పలు హౌసింగ్ సంస్కరణలు తెస్తున్నామని చెప్పారు. బిల్డర్లు, బయ్యర్ల సమస్యలను పరిష్కరించామని తెలిపారు. 

 తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్క నొయిడా, గ్రేటర్ నొయిడాలోనే 3.5 లక్షల బయ్యర్లు ఉన్నాయని, వారి డబ్బులు బిల్డర్ల చేతుల్లో చిక్కిపోయాయని చెప్పారు. దీనిపై తాము చర్యలు తీసుకున్నందున తొలి సంవత్సరంలోనే 1.25 లక్షల మంది ప్రజలు ఇళ్లు సాధించుకున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో తమ భద్రతకు ఢోకాలేదని మహిళలు సంతృప్తిగా ఉన్నారని, కేంద్ర, రాష్ట్ర పథకాల నుంచి వారు లబ్ధి పొందుతున్నారని వివరించారు.