ఉత్తర గోవాలో అర్పోరా గ్రామంలో ఉన్న బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్‌లో అర్ధరాత్రి సమయంలో సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగి 25 మంది మృతి చెందారు. సుమారు 50 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మిగితావారంతా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యటకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. గ్యాస్ సిలిండర్ పేలడానికి ముందు, డ్యాన్స్ ఫ్లోర్‌పై దాదాపు 100 మంది డ్యాన్స్ చేస్తుండటాన్ని కళ్లారా చూశానని హైదరాబాదీ టూరిస్ట్ ఫాతిమా షేక్ చెప్పారు. జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బిర్స్ నైట్ క్లబ్‌లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని పేర్కొంటూమృతుల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో మాట్లాడానని, బాధితులకు అవసరమైన సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ప్రధాని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరిశీలించారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఆ క్లబ్ యజమాని, జనరల్ మేనేజర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ఆయన వెల్లడించారు. వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. క్లబ్ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్లబ్‌లో భద్రతా నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా తెలుస్తున్నదని వెల్లడించారు.
“ఈ నైట్ క్లబ్ ఒక ఇరుకువీధిలో ఉంది. దీనివల్ల మేం మంటలను ఆర్పేందుకు అక్కడికి చేరుకోవడంలో జాప్యం జరిగింది. మేం చేరుకునే సమయానికే భారీ నష్టం జరిగిపోయింది. చనిపోయిన వారిలో చాలామంది, మంటల వలయం నడుమ ఊపిరాడక కన్నుమూశారు. చాలామంది గ్రౌండ్ ఫ్లోర్‌లోనూ చిక్కుకుపోయారు” అని అర్పోరా గ్రామం పరిధిలోని ఫైర్ – ఎమర్జెన్సీ సర్వీసుల సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
More Stories
యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి త్వరలో!
పుతిన్ కు భారత్ వైవిధ్యం సూచించే బహుమతులు
యాసిడ్ దాడి నిందితులపై సానుభూతి చూపరాదు