కాంగ్రెస్ ఇచ్చిన హామీలెప్పుడు అమలవుతాయా అని రైతులు, రైతు కూలీలు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెన్షనుదారుల వంటి వర్గాలన్నీ రెండేళ్లుగా ఆశగా చూస్తుంటే, హామీలను అమలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవాలంటూ రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఏ మొహం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తూ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకూలురను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఏం సాధించిందని ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు? ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలా? ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువెల్లా దగా చేసిన కాంగ్రెస్ సర్కారుకు విజయోత్సవాలు చేసుకునే అర్హత లేదని స్పష్టం చేశారు. ప్రజలను వంచించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ముందుగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని ధ్వజమెత్తారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టి మోసం చేసినందుకు విజయోత్సవాలా? సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎంపీటీసీ, జడ్ పిటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తంలో ఇచ్చిన 420 హామీల్లో ఎన్ని వాగ్ధానాలు అమలు చేసారో ప్రజలకు వివరించే దమ్ముందా ముఖ్యమంత్రికి? అని నిలదీశారు.రెండేళ్ల పాలనపై ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే హామీల అమలుపై శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తము పేరుతో ఆరు గ్యారంటీల కార్డును ప్రధాన హామీగా ఇవ్వడమే కాకుండా, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఈ ఆరు గ్యారంటీలను బాండ్ పేపర్ల రూపంలో ప్రజలకు మాటిచ్చి ఎన్నికల్లో గెలిచి, పదవులు పొందాకా ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేసినందుకా? అని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం అభయ హస్తం ఫైలు పైనే చేశారని చెబుతూ క్యాబినెట్ తొలి భేటీలో కూడా అభయహస్తం ఆరు గ్యారంటీల కార్డుకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించి, దానికి చట్టబద్దత కల్పించకుండా అటకెక్కించి తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకా విజయోత్సావాలు? అని ఎద్దేవా చేశారు. ఎందుకు ప్రజా విజయోత్సవాలు … బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరధ పధకాల్లో జరిగిన అవినీతిని వెలికితీసి కేసిఆర్, కేటిఆర్, హరీష్ రావులను దోషులుగా నిలబెడుతామని, వారు దోచుకున్న అవినీతిని కక్కిస్తామని చెప్పి అవేమి చేయకుండా వారితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని సగం సొమ్మును కొట్టేసినందుకా? అని ప్రశ్నించారు.

More Stories
వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 చారిత్రాత్మక సంస్కరణ
అట్టహాసంగా ప్రారంభమైన మేడారం జాతర
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు `సుప్రీం’ కోర్టుధిక్కార నోటీసులు