ఇండిగో సంక్షోభంపై అత్యున్నత విచారణ .. వేయి విమానాలు రద్దు

ఇండిగో సంక్షోభంపై అత్యున్నత విచారణ .. వేయి విమానాలు రద్దు
 
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ-ఇండిగోలో సంక్షోభం మరింత ముదిరింది. శుక్రవారం దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా విమాన సర్వీసులు రద్దు కాగా, శనివారం కూడా 1000 కంటే కాస్త తక్కువ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. పరిస్థితి డిసెంబర్ 10-15 నాటికి సాధారణ స్థితి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారకులైన వారిని గుర్తించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది. సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసింది.  ప్రయాణికులు 011 2461 0843, 2469 3963, 096503 91856 నంబర్లకు కాల్‌ చేయాలని సూచించింది. ఈ కంట్రోల్‌ రూం ద్వారా బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్రం తెలిపింది.

ఇండిగో విమానయాన సంస్థలో గత నాలుగు రోజులుగా విమాన సర్వీస్‌లు వేళకు నడవడం లేదు.  ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్లే అన్ని దేశీయ విమానాలు అర్ధరాత్రి వరకూ రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ప్రయాణికుల అవస్థలు గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థలో నెలకొన్న సమస్యలను నిగ్గు తేల్చేందుకు శుక్రవారం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలా హఠాత్తుగా విమానాల రద్దుకు దారితీసే పరిణామాలను నియంత్రించేందుకు అవసరమైన సూచనలు చేయనుంది విచారణ సంఘం.

ఈ అంతరాయాలకు కారణమయ్యే అంశాలపై సమగ్ర సమీక్ష మరియు అంచనా వేయడానికి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించింది. ఈ ప్యానెల్‌లో జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కె బ్రహ్మణే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, సొసైటీ ఆఫ్ ఇండియన్ కమర్షియల్ పైలట్స్ (ఎస్ఎఫ్ఓఐ) కెప్టెన్ కపిల్ మాంగ్లిక్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఓఐ) నుండి కెప్టెన్ లోకేష్ రాంపాల్ ఉన్నారు.

ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది. డీజీసీఏ ఇచ్చిన ఎఫ్‌డీటీఎల్‌ ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని తెలిపింది. పరిస్థితులను వీలైనంత త్వరగా చక్కదిద్దుతామని, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. 

 
రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్‌ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచించింది.   ఓవైపు నష్టాలు.. మరోవైపు ప్యాసింజర్స్ కష్టాలపై శుక్రవారం ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్  కీలక ప్రకటన చేశారు. ఊహించని అంతరాయానికి తమను క్షమించాలని కోరిన ఆయన శుక్రవారం ఒక్కరోజే వెయ్యికిపైగా విమానాలు రద్దు చేశామని వీడియో మెసేజ్ విడుదల చేశారు.

“కొన్ని రోజులుగా విమాన సర్వీస్‌ల విషయంలో అంతరాయాలు చూస్తున్నాం. అప్పటి నుంచి ఈ పరిస్థితి మరింత జఠిలంగా మారింది. డిసెంబర్ 5, శుక్రవారం మాత్రం సర్వీస్‌లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఒక్కరోజే 1000కి పైగా విమానాలను రద్దు చేశాం. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందుకు నా తరఫున, మా సంస్థ ఇండిగో తరఫున మీఅందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా. సర్వీస్‌లు ఆలస్యంగా నడవడం, పలు విమానాలు రద్దు కావడంతో చాలామంది కష్టాలు పడుతున్నారు. ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం పది రోజులు పట్టేలా ఉంది. డిసెంబర్ 10-15 వరకూ సర్వీస్‌లు యథావిధిగా నడిచే అవకాశముంది”  అని పీటర్స్ పేర్కొన్నారు.
మరోవంక, ఇండిగోలో నెలకొన్న సంక్షోభంతో విమాన టికెట్‌ ధరలకు రెక్కలొచ్చాయి. ఇతర విమానయాన సంస్థలు టికెట్‌ ధరలను భారీగా పెంచాయి. దీంతో ప్రయాణికుల విమాన ప్రయాణం మరింత భారంగా మారింది.  శుక్రవారం ఢిల్లీ-ముంబై, ముంబై-ఢిల్లీ మార్గంలో విమాన టికెట్‌ ధర ఏకంగా రూ.60 వేలుగా (రౌండ్‌ ట్రిప్‌) ఉంది. అదే వన్‌వే అయితే రూ.35,000గా చూపిస్తోంది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఇది ఒకటి. దీంతో విమాన టికెట్‌ ధరలను విమానయాన సంస్థలు భారీగా పెంచాయి. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై సహా ఇతర నగరాలకు విమాన సర్వీసుల టికెట్‌ ధరలు కనిష్ఠంగా రూ.22 వేల నుంచి రూ.30 వేల వరకు ఉన్నాయి. 
 
సాధారణ సమయాల్లో రూ.6-10 వేల మధ్య ఉండే ధరలు ఇంత భారీగా పెరగడంతో అత్యవసర పనులపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విదేశాలకు వెళ్లే విమానాలకు కూడా ఇంత టికెట్‌ ధర ఉండదంటూ వాపోతున్నారు. కొందరు ప్రయాణికుల తమ గమ్య స్థానాలకు చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో రద్దీ, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.కొన్ని రోజులుగా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయో తాము అర్థం చేసుకోగలమని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అనేక విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని, ఇందుకు సంస్థ హృదయపూర్వక క్షమాపణలు కోరింది. ఇవాళ అత్యధికంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపింది.  సిస్టమ్‌ రిబూట్‌, షెడ్యూల్‌ మెరుగుదలకు అవసరమని పేర్కొంది.

ప్రయాణికులకు సహకరించేందుక, కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చిందేకు కృషి చేస్తున్నామని తెలిపింది. రద్దయిన ఫ్లైట్లకు సంబంధించి రీఫండ్‌ ఆటోమెటిగ్గా ఇచ్చేస్తామని ఇండిగో సంస్థ తెలిపింది. డిసెంబర్‌ 5వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య టికెట్లు బుక్‌ చేసుకుని, ఈ అంతరాయాల కారణంగా వాటిని రద్దు లేదీ రీషెడ్యూలింగ్ చేసుకుంటే పూర్తి రీఫండ్‌ ఇస్తామని ప్రకటించింది.  కస్టమర్ల సౌకర్యం కోసం దేశవ్యాప్తంగా వేలాది హోటల్‌ గదులు, రవాణా సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపింది.  నిరీక్షిస్తున్న కస్టమర్ల కోసం భోజనం, స్నాక్స్‌ అందిస్తున్నామని పేర్కొంది. వృద్ధులకు లాంజ్‌ యాక్సెస్‌ అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది.