జమిలి ఎన్నికలకు అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు

జమిలి ఎన్నికలకు అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు
* జేపీసీకి లా కమిషన్ స్పష్టం 
 

‘ఒక దేశం- ఒకేసారి ఎన్నికలు’ లక్ష్యంతో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవేశపెడుతున్న బిల్లులకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం లేదని లా కమిషన్‌ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి తెలిపింది. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ఏమీ ప్రయత్నించడం లేదని పేర్కొంది.  సమాఖ్య నిర్మాణానికి భంగకరమయ్యేలా రాజ్యాంగ నిబంధనల్నీ మార్చడం లేదని స్పష్టం చేసింది.

ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే పలు వర్గాలతో చర్చించిన జేపీసీ లా కమిషన్‌తో కూడా విస్తృత చర్చలు జరిపింది. బిజెపి ఎంపీ, జెపిసి చైర్మన్ పిపి చౌదరి అధ్యక్షత వహించారు. మరో రెండు నెలల్లో మరింత మంది నిపుణులు, సంస్థలతో చర్చలు జరిపిన తర్వాత నివేదికను రూపొందించి వచ్చే బడ్జెట్‌ సమావేశాలలోపు సమర్పించనుంది.  ఈ నివేదికను బడ్జెట్‌ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
కాగా, రాజ్యాంగంలోని 368వ అధికరణ కింద జమిలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని 23వ లా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి జేపీసీ సభ్యులకు వివరించారు. ఈ రాజ్యాంగ సవరణకు కనీసం 50 శాతం అసెంబ్లీలు ఆమోదించాల్సిన అవసరమేదీ లేదని పేర్కొన్నారు.  జమిలి ఎన్నికల కోసం ప్రవేశపెట్టే ప్రతిపాదనలన్నీ రాజ్యాంగ పరిమితుల్లోనే ఉన్నాయని, లోక్‌సభ, శాసనసభల ఎన్నికల షెడ్యూలును ఒకే తేదీల్లో నిర్ణయించడం వల్ల ప్రజల ఓటు హక్కుకేమీ నష్టం వాటిల్లదని కూడా స్పష్టం చేశారు. 
లోక్‌సభ, శాసనసభల కాలపరిమితికి సంబంధించి ఆందోళన కూడా అవసరం లేదని జేపీసీ సభ్యులకు లా కమిషన్‌ తెలిపింది.  రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించి కూడా చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకే ఉందని తెలిపింది. అందువల్ల ఈ మేరకు బిల్లులు చేసే అధికారం పార్లమెంట్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. 82ఏ(3), 82ఏ(5) క్లాజుల కింద ఎన్నికల కమిషన్‌కు విస్తృత అధికారాలు కల్పించడంపై వచ్చిన సందేహాలను కమిషన్‌ నివృత్తి చేసింది. 
 
రాజ్యాంగంలోని 324 అధికరణ కింద ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు విస్తృత అధికారాలున్నాయని, ఇప్పటికే ఉన్న కమిషన్‌ అధికారాలను సంబంధిత క్లాజులు మరింత స్పష్టీకరిస్తాయని వివరించింది. అయితే తమ ప్రశ్నలకు లా కమిషన్‌ సభ్యులు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయారని ప్రతిపక్ష సభ్యుడొకరు పేర్కొన్నారు.  ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా ఓటు వేసే అవకాశాలు ఉండకపోవచ్చునని, దీంతో ఓటు వేసిన తర్వాత సమీక్షించుకునే అవకాశం ఉండదని తాము చెప్పినట్లు తెలిపారు.