* ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అంటూ రష్యాకు పుతిన్ పయనం
గంగా, వోల్గా నదుల సంగమం స్ఫూర్తి సంవత్సరాలుగా విచ్ఛిన్నం కాకుండా ఉన్న లోతైన భారతదేశం- రష్యా సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. రెండు రోజులపాటు భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం ఆమె శుక్రవారం సాయంత్రం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధం శాంతి, స్థిరత్వం, పరస్పర పురోగతిల ప్రతిజ్ఞపై ఆధారపడి ఉందని తెలిపారు.
“భారతదేశం-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నందున ఈ రోజు మనందరికీ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ భాగస్వామ్యానికి పునాది అక్టోబర్ 2000లో పుతిన్ భారతదేశానికి చేసిన భారత్ పర్యటన సందర్భంగా జరిగింది” అని ఆమె గుర్తు చేశారు. ఈ భాగస్వామ్యంను 2010లో ప్రత్యక భాగస్వామ్యం నుండి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చెందిందని ఆమె చెప్పారు.
2025 భారతదేశం- రష్యా సంబంధాలకు ఉన్నత స్థాయి రాజకీయ సమాలోచనలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, భద్రత, పౌర అణు సంస్థ, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు వంటి వివిధ రంగాలలో చాలా విజయవంతమైందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. “భారతదేశం, రష్యా మధ్య జరిగిన 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం ముగింపులో విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన మన ప్రత్యేక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. మన ద్వైపాక్షిక సహకారం భవిష్యత్తులో మరింతగా బలోపేతం కావడానికి వివరణాత్మక రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది” అని ఆమె భరోసా వ్యక్తం చేశారు.
రెండు నాగరికతలు, సంస్కృతుల మధ్య సంబంధాలు చాలా పురాతనమైనవని రాష్ట్రపతి తెలిపారు. “భారతీయ వ్యాపారులు చాలా కాలంగా రష్యాకు ప్రయాణిస్తున్నారు. మహాత్మా గాంధీ, లియో టాల్‌స్టాయ్ మధ్య స్ఫూర్తిదాయకమైన లేఖల మార్పిడి చరిత్ర ఉంది. రెండు దేశాలు ఒకరి సాంస్కృతిక, సాహిత్య, కళాత్మక వారసత్వంపై పరస్పర ఆసక్తిని పంచుకుంటాయి” అని ముర్ము వివరించారు.
“గంగా, వోల్గా నదుల సంగమం స్ఫూర్తి కూడా మన ప్రత్యేక సంబంధాలను గుర్తుకు తెస్తుందని, భవిష్యత్తులో కూడా మన సహకారానికి మార్గనిర్దేశం చేస్తుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను,” అని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చిన విందు ముగిసిన తర్వాత అక్కడి నుంచి పుతిన్ నేరుగా పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. ‘కలిసి సాగుదాం, కలిసి ఎదుగుదాం’ అన్న నినాదంతో తన భారత పర్యటనకు ముగింపు పలికారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. డిల్లీ నుంచి రష్యాకు బయల్దేరిన ఆయనకు విమానాశ్రయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వీడ్కోలు పలికారు

More Stories
పాక్ అధికారులపై ఆంక్షలు.. అమెరికా కాంగ్రెస్ సభ్యుల వినతి
జమిలి ఎన్నికలకు అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు
ఏ దేశం ఒంటరి కాదు.. పుతిన్ భారత్ పర్యటనపై చైనా మీడియా!