పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ‘బాబ్రీ మసీదు’ను పోలి ఉండేలా రూపొందించిన ప్రతిపాదిత మసీదుకు సస్పెండ్ చేసిన టిఎంసి ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ శనివారం భూమి పూజ జరిపారు. డిసెంబర్ 6, 1992న అయోధ్యలో జరిగిన సంఘటన వార్షికోత్సవంతో సమానంగా ఈ కార్యక్రమం చేపట్టడంతో అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ విషయమై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ `నిప్పుతో చెలగాటం’ ఆడుతున్నారంటూ బిజెపి హెచ్చరించింది. సస్పెండ్ చేసిన పార్టీ ఎమ్యెల్యేను ఒక వర్గంను రెచ్చగొట్టి వోటు బ్యాంకుగా మార్చుకునేందుకు పోలీసుల పహారాతో మద్దతు ఇస్తున్నారంటూ ఆరోపించింది. బెల్దంగా ప్రాంతాన్ని హై-సెక్యూరిటీ జోన్ కింద ఉంచారు. శాంతిభద్రతలను కాపాడటానికి, సజావుగా కదలికను నిర్ధారించడానికి పోలీసు యూనిట్లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్), సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) లనుండి అదనపు దళాలను మోహరించారు. ప్రతిపాదిత నిర్మాణ స్థలం సమీపంలో కేంద్ర దళాలు రూట్ మార్చ్‌లు, పెట్రోలింగ్ నిర్వహించాయి.
మసీదు నిర్మాణం కోసం చేపట్టిన భూమిపూజ సందర్భంగా ఎమ్మెల్యే కబీర్ తన అనుచరులతో కలిసి రిబ్బన్ కత్తిరించారు. నారా -ఈ-తక్బీర్, అల్లాహూ అక్బర్ అని అరిచారు. చాలా మంది మసీదు నిర్మాణం కోసం స్వచ్చంగా ఇటుకలు మోసారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని బలమైన విజ్ఞప్తి చేశారు. బెంగాల్ దీర్ఘకాల సహజీవన సంప్రదాయం గురించి ఆమె మాట్లాడుతూ “ఐక్యతే బలం” అని ఆమె పేర్కొన్నారు.
“బెంగాల్ నేల ఎల్లప్పుడూ సామరస్యం కోసం నిలుస్తుంది. రవీంద్రనాథ్, నజ్రుల్, రామకృష్ణ, వివేకానందుల నేల. ఇది విభజనలను ఎప్పుడూ అనుమతించలేదు” అంటూ తెలిపారు. “బెంగాల్లో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, జైన, బౌద్ధ, మనమందరం కలిసి ఎలా నడవాలో తెలుసు. మతం ప్రతి ఒక్కరికి చెందినది, కానీ పండుగలు అందరికీ చెందినవి” అని ఆమె తెలిపారు. అసమ్మతిని సృష్టించే ఏ ప్రయత్నాలనైనా గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని, పౌరులు శాంతి, పరస్పర గౌరవాన్ని కొనసాగించాలని ఆమె కోరారు.
కాగా, బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ముర్షిదాబాద్‌లోని బెల్దంగా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ “నిప్పుతో చెలగాటం” ఆడుకుంటున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం పరిస్థితిని ఉపయోగిస్తున్నారని మాల్వియా ఆరోపించారు.
సస్పెండ్ చేసిన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను సమాజ మనోభావాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించుకుంటున్నారని, కబీర్ మద్దతుదారుల బృందాలు నిర్మాణ సామగ్రిని ఆ ప్రదేశానికి తీసుకువెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయని మాల్వియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యకలాపాలకు రాష్ట్ర పోలీసుల మద్దతు ఉందని కబీర్ పేర్కొన్నారని ఆయన ఆరోపించారు.
అక్కడ జరిగే ఏదైనా అలజడి ఉత్తర బెంగాల్‌ను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే కీలక మార్గం అయిన ఎన్ హెచ్-12ను ప్రభావితం చేస్తుందని మాల్వియా పేర్కొంటూఅలాంటి పరిస్థితి ప్రజా శాంతి మరియు కదలికలపై విస్తృత ప్రభావాలను చూపుతుందని ఆయన హెచ్చరించారు. ప్రతిపాదిత మసీదు నిర్మాణాన్ని “రాజకీయ ప్రాజెక్ట్”గా పేర్కొంటూ, ఇది ఉద్రిక్తతలను పెంచుతుందని, రాష్ట్ర సామాజిక వాతావరణాన్ని దెబ్బతీస్తుందని మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఈ మసీదు ప్రాజెక్ట్ అని పిలవబడేమతపరమైన ప్రయత్నం కాదు, భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి, ఓటు బ్యాంకులను ఏకీకృతం చేయడానికి రూపొందించిన రాజకీయ ప్రయత్నం” అని ఆయన మండిపడ్డారు. ఇది బెంగాల్ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు.
“మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ను అల్లకల్లోలం వైపు నెట్టడం అంటే కూడా ఏమీ ఆపరు” అని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ, “బాబర్ తండ్రి ఉమర్ షేక్ మీర్జా సమాధి నుండి లేచినా, ఈ దేశ ప్రజలు ఇప్పటికీ అతన్ని బాబ్రీ మసీదు నిర్మించడానికి అనుమతించరు. బాబ్రీ మసీదును నిర్మించడానికి ఎవరైనా ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఈ దేశ ప్రజలు ప్రతిసారీ ఈ కళంకాన్ని తుడిచివేస్తారు” అని హెచ్చరించారు.

More Stories
లుధియానాలో అక్రమ బంగ్లాదేశీయులపై పోస్ట్ కు అరెస్ట్!
పాక్ అధికారులపై ఆంక్షలు.. అమెరికా కాంగ్రెస్ సభ్యుల వినతి
గంగ, ఓల్గా నదుల స్ఫూర్తి భారత్- రష్యాలకు మార్గనిర్ధేశం