స్వరాజ్ కౌశల్ 1952 జులై 12న సోలన్లో జన్మించారు. ప్రముఖ క్రిమినల్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన ఆయన 1990–1993 మిజోరం గవర్నర్ గా పనిచేశారు. 1998–2004 హర్యానా వికాస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా కూడా సేవలందించారు 1975లో సుష్మా స్వరాజ్ తో వివాహం చేసుకున్నారు. వారి ఏకైక సంతానం బన్సూరి స్వరాజ్. న్యాయవాదిగా తన కెరీర్‌లో స్వరాజ్ కౌశల్ ఎన్నో కీలక కేసులు వాదించారు. ఎమర్జెన్సీ సమయంలో బరోడా డైనమైట్ కేసులో సోషలిస్ట్ నేత జార్జ్ ఫెర్నాండెజ్ తరఫున వాదించి గుర్తింపు పొందారు. ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై నిపుణుడిగా ఆయనకు మంచి పేరుంది.
1986లో మిజోరం శాంతి ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించి, 20 ఏళ్ల తిరుగుబాటుకు ముగింపు పలికారు. 1987లో మిజోరం తొలి అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 1990-93 మధ్య మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. మరోవైపు1998-2004 మధ్య హర్యానా రాష్ట్రానికి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహించారు. హర్యానా వికాస్ పార్టీ నేత అయిన ఆయన 1998-99, 2000-2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
కౌశల్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడ విచారం వ్యక్తం చేస్తూ, ఈ వార్త తనను తీవ్రంగా బాధపెట్టిందని తెలిపారు. కౌశల్ న్యాయవాదిగా తనను తాను ప్రత్యేకతను చాటుకున్నారని, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని మోదీ కొనియాడారు.
“ఆయన భారతదేశపు అతి పిన్న వయస్కుడైన గవర్నర్ అయ్యారు. గవర్నర్‌గా తన పదవీకాలంలో మిజోరాం ప్రజలపై శాశ్వత ముద్ర వేశారు. పార్లమెంటేరియన్‌గా ఆయన అంతర్దృష్టులు కూడా గమనార్హం. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుమార్తె బన్సూరి, ఇతర కుటుంబ సభ్యులతో ఉన్నాయి. ఓం శాంతి,” అని ప్రధాని మోదీ ఎక్స్ లో రాశారు.
కౌశల్ మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సమాజానికి, ముఖ్యంగా న్యాయశాస్త్రంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు.

More Stories
‘జన నాయగన్’ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
బెంగాల్లో ఈడీ దర్యాప్తునకు ఆటంకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
వైవిధ్యాన్నే బలంగా మార్చుకొని ఎదుగుతున్నాం