ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన మోదీ

ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన మోదీ
రెండురోజుల పర్యటన భారత పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్‌ పుతిన్‌ కు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. గురువారం సాయంత్రం 6.35 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో దిగిన పుతిన్‌కు ప్రొటోకాల్‌కు భిన్నంగా ప్రధాని నరేంద్రమోదీ సాదర స్వాగతం పలికారు. కళాకారులు సంప్రదాయ నృత్యం చేస్తుండగా.. విమానం దిగిన పుతిన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. 
 
సాధారణంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తన సొంత కారును మాత్రమే వాడే పుతిన్‌ను ప్రధాని మోదీ తన టొయోటా ఫార్చ్యూనర్‌ కారులో తన అధికారిక నివాసానికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఎక్స్‌’లో ఆయన ఒక పోస్టు పెట్టారు. ‘‘నా స్నేహితుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్వాగతం పలికినందుకు ఆనందంగా ఉంది. ఈ రాత్రి, రేపు మా ఇద్దరి మధ్య జరిగే సమావేశాల కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత్‌-రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచింది, మన ప్రజలకు అపారమైన మేలు చేకూర్చింది’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత పుతిన్‌కు ఆయన ప్రైవేటు విందు ఇచ్చారు. పుతిన్‌ రాక సందర్భంగా మోదీ అధికారిక నివాసాన్ని విద్యుద్దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుతిన్‌తోపాటు వచ్చిన బృందంలో ఏడుగురు రష్యన్‌ మంత్రులు, పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, రష్యా సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్‌ ఉన్నారు.  నాలుగేళ్ల తర్వాత, అమెరికా ఆంక్షల వేళ కీలకమై ద్వైపాక్షిక చర్చల కోసం ఆయన ఢిల్లీలోని పాలం విమానాశ్రయం చేరుకున్న పుతిన్‌కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికి హత్తుకొన్న ప్రధాని మోదీ అనంతరం భారత అధికారులను ఆయనకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఇరువురు నృత్యకారుల ప్రదర్శనను వీక్షించారు.
 
పుతిన్‌కు గౌరవార్థం గురువారం రాత్రి ప్రధాని అక్కడ విందు ఇచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం పలుకున్నారు. అలాగే, 23వ భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్‌ పాల్గొంటారు. ఈ సందర్భంగా అణువిద్యుత్‌ సహా పలు రంగాల్లో రెండుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి.  2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్‌ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఈచర్చ జరగనుంది.
అలాగే రష్యా నుంచి భారత్‌ ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా విధిస్తున్న ఆంక్షల ప్రభావంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల గురించి పుతిన్‌ మోదీకి వివరించనున్నట్టు సమాచారం. అంతకు ముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రష్యా ఆరోగ్యమంత్రి మిఖాయిల్‌ మురాష్కోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆరోగ్యరంగంలో ద్వైపాక్షిక సహకారం, భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు అంగీకరించారు.
 
ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత పుతిన్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. భారత్‌-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర భేటీలో భాగంగా మోదీతో సమావేశమవుతారు. భారత్‌తో సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు గతంలో పుతిన్‌ పేర్కొన్నారు.  ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం, వ్యవసాయం తదితర రంగాల్లో ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా ఇరుదేశాలు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
భారత్‌ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపై సైతం చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ పర్యటన భారత్‌-రష్యా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఆర్థిక సహకారాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్‌ రష్యాతో తన వాణిజ్య లోటును మెరుగుపరచుకోవాలని ఆశిస్తోంది. ఔషధాలు, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తుల రంగాల్లో సహా రష్యాకు భారత ఎగుమతులను పెంచడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. దాంతో భారత్‌ ఉత్పత్తులకు భారీ మార్కెట్‌ ఏర్పడనున్నది. ఉద్యోగాలతో పాటు రైతులకు లాభదాయకంగా ఉండనున్నది.