అమెరికాది ఒప్పు.. భారత్‌ది తప్పా?

అమెరికాది ఒప్పు.. భారత్‌ది తప్పా?
 
* ఇండియా టుడే ప్రత్యేక ఇంటర్వ్యూలో పుతిన్ 
 
రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్న విమర్శలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తిప్పికొట్టారు. అమెరికా ద్వంద్వ నీతిని ఎండగట్టారు. తమ అణు రియాక్టర్ల కోసం రష్యా నుంచి అమెరికా యురేనియం కొనుగోలు చేస్తున్నదని పేర్కొన్న ఆయన భారత్‌ ఆయిల్‌ కొనుగోలు చేస్తుంటే మాత్రం అమెరికా ఆంక్షలు విధిస్తున్నదని తప్పుబట్టారు. 
 
రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌కు రావడానికి కొద్దీ గంటల ముందు ఇండియా టుడేకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రష్యా నుంచి కొనుగోలు చేసే హక్కు అమెరికాకు ఉన్నప్పుడు భారత్‌ కూడా అదే హక్కు ఉంటుంది కదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై ట్రంప్‌తో చర్చించనున్నట్టు తెలిపారు. అమెరికాకు మా నుంచి ఇంధనం కొనుగోలు చేసే హక్కు ఉన్నప్పుడు భారత్‌ హక్కును ఎందుకు హరించాలని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం భారత్‌తో ఉన్న ఇంధన సహకారంలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
భారత్-రష్యా మైత్రి ఇతరులకు వ్యతిరేకం కాదు

భారత్‌-రష్యా మధ్య సహకారం, మైత్రి ఏ దేశానికీ వ్యతిరేకం కాదని పుతిన్‌ స్పష్టం చేశారు. తమ దేశాల ప్రయోజనాల పరిరక్షణ మాత్రమే ఏకైక లక్ష్యమని వివరించారు. రష్యాతో భారత ఇంధన సంబంధాల గురించి మాట్లాడుతూ, రష్యాతో భారత దేశ సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ మార్కెట్లలో భారత్‌ పాత్ర పెరుగుతుండటం కొన్ని శక్తులకు ఇష్టం లేదని చెప్పారు. 

అందుకే ఆ శక్తులు కృత్రిమ అడ్డంకులు సృష్టిస్తూ, రాజకీయ కారణాలతో భారత దేశ పలుకుబడిని కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలను ప్రస్తావిస్తూ, భారతదేశానికి తన దేశ ఇంధన సహకారం అత్యధికంగా ఎటువంటి ప్రభావం లేకుండా కొనసాగుతుందని తెలిపారు. బయటి శక్తుల నుంచి తాము ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, తాను కానీ, పీఎం మోదీ కానీ వేరొకరికి వ్యతిరేకంగా పని చేయడానికి తమ మధ్య సహకారాన్ని ఎన్నడూ ఉపయోగించుకోలేదని తేల్చి చెప్పారు.

అసలు ప్రమాదకారి నాటో

రక్షణ కోసం సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు, అధికారం ఉక్రెయిన్‌కు ఉన్నాయని పుతిన్‌ పునరుద్ఘాటించారు. అయితే, రష్యా భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఆ నిర్ణయాలు ఉండకూడదని తెలిపారు. రష్యన్‌ భాష, సంస్కృతి, రష్యన్‌ మతం, భౌగోళిక సమస్యలు… ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలని చెప్పారు. నాటో పూర్తిగా భిన్నమైన అంశమని తెలిపారు. 

తమకు ప్రత్యేకంగా కావాలని దేనినీ డిమాండ్‌ చేయడం లేదని పేర్కొంటూ మరో దేశాన్ని పణంగా పెట్టడం వల్ల ఓ దేశానికి భద్రత రాదని అంతర్జాతీయ భద్రతా నిబంధనలు, సూత్రాలు చెప్తున్నాయని తెలిపారు. సార్వభౌమాధికారం గల ఏ దేశానికైనా తనను తాను కాపాడుకునే హక్కు ఉంటుందని, అదే విధంగా ఆ హక్కు ఉక్రెయిన్‌కు కూడా ఉందని చెప్పారు. 

ఆ హక్కును ఉక్రెయిన్‌కు తాము తిరస్కరించామా? అని ప్రశ్నించారు. ‘లేదు’ అని ఆయన సమాధానం చెప్పి, రష్యాను పణంగా పెట్టి ఆ పని చేయడం మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ‘నాటోలో చేరడం వల్ల తనకు లబ్ధి చేకూరుతుందని ఉక్రెయిన్‌ నమ్ముతున్నది. అది తమ భద్రతకు ముప్పు అని మేం చెప్తున్నాం. మాకు ముప్పు లేకుండా, మిమ్మల్ని కాపాడుకోగలిగే మార్గాన్ని మనం అన్వేషిద్దాం’ అని హితవు చెప్పారు.

భారత్ అభివృద్ధిలో చాలాదూరం వచ్చింది

భారతదేశంతో ఏడు దశాబ్దాల స్నేహాన్ని నొక్కిచెబుతూ భాగస్వామ్యాన్ని “వేగంగా మారుతున్న ప్రపంచంలో స్థిరంగా, అభివృద్ధి చెందుతున్న, కీలకమైనది” అని పిలిచారు. “ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త శక్తి కేంద్రాలు ఉద్భవిస్తున్నాయి. అందువల్ల, ద్వైపాక్షిక, అంతర్జాతీయ సంబంధాలలో క్రమంగా పురోగతి సాధించడానికి ప్రధాన దేశాల మధ్య స్థిరత్వాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యం” అని పుతిన్ తెలిపారు.

“భారతదేశంతో రష్యా సహకారం విస్తృత శ్రేణిని కలిగి ఉంది.  వాస్తవానికి, మా సంబంధం ప్రత్యేక స్వభావం మరొక ప్రాముఖ్యతను జోడిస్తుంది” అని పుతిన్ పేర్కొన్నారు, “స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి గత 77 సంవత్సరాలుగా భారతదేశం సాధించిన పురోగతి, చారిత్రక పరంగా చాలా తక్కువ కాలం, నిజంగా గణనీయమైనది. భారతదేశం నిజంగా అభివృద్ధిలో చాలా దూరం వచ్చింది” అని కొనియాడారు.  

“ఇప్పుడు ప్రపంచంలో కొత్త శక్తి కేంద్రాలు ఏర్పడుతున్నాయి. భారత్‌ కూడా ప్రపంచ ప్రధాన శక్తి. ఇది 77 ఏళ్ల కిందటి ఇండియా కాదు. నాటి తీరులో నేటి భారత్‌ను చూడకూడదు. భారత్ ఇప్పుడు బ్రిటీష్ కాలనీ కాదని గుర్తుంచుకోవాలి. వాస్తవాన్ని ప్రతీ ఒక్కరు అంగీకరించాలి” అని పుతిన్ స్పష్టం చేశారు.

ఒత్తిళ్లకు లొంగని సాహసోపేత నేత మోదీ

అమెరికా సహా ఏ దేశం నుంచి ఒత్తిళ్లు ఎదురైనా లొంగని సాహసోపేత నేత భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని పుతిన్ కొనియాడారు. మోదీ అంత ఈజీగా ఒత్తిళ్లకు లొంగిపోయే మనిషి కాదన్నారు. తప్పకుండా భారతీయులంతా ప్రధాని మోదీని చూసి గర్వించొచ్చని పేర్కొన్నారు. ఘర్షణకు తావు ఇవ్వకుండా దృఢమైన, ముక్కుసూటి వైఖరితో మోదీ వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు.


“చైనాలో ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా ఎవరి కార్లు వారు ఎక్కేందుకు మేం బయలుదేరాం. ఈక్రమంలో నేనే ప్రధాని మోదీని పలకరించాను. మనం ఇద్దరం కలిసి వెళ్దామా ? అని అడిగాను. అందుకు మోదీ ఓకే చెప్పారు. ఇందులో రహస్య పథకమేదీ దాగి లేదు. నా కారులో కూర్చొని ఇద్దరం పాత స్నేహితుల్లా మాట్లాడుకున్నాం. మేం మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. వాటిపై చర్చించుకున్నాం. చివరకు ఎస్‌సీఓ సదస్సు వేదిక వచ్చాక, కారులో నుంచి దిగాం. మేం చర్చించుకోవాల్సిన చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయనేది దీని సారాంశం. నా మిత్రుడు మోదీతో మళ్లీ భేటీ కాబోతున్నందుకు సంతోషంగా ఉంది” అని పుతిన్ వివరించారు.