2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్- రష్యా వాణిజ్యం

2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్- రష్యా వాణిజ్యం

ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన అత్యున్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాధినేతలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఐదేళ్ల ప్రణాళికతో ఈ మేరకు ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భారత్- రష్యా లక్ష్యంగా పెట్టుకున్నాయి. 

ఇందుకోసం వాణిజ్య అసమతుల్యతను సరిచేయడానికి భారత్​ నుంచి వస్తువుల సరఫరాను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావాన్ని అధిగమించడానికి, ద్వైపాక్షిక పరిష్కారంపై ఇరు దేశాల దృష్టిసారించాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు తమ తమ జాతీయ కరెన్సీల (రూపాయి, రూబుల్)లో చేసే అంశంపై దృష్టిసారించాలని ఈ ద్వైపాక్షిక భేటీలో అవగాహనకు వచ్చారు. ఇందుకోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇరు దేశాల నిర్ణయించాయి.

రష్యా పర్యాటకులకు ఉచిత 30 రోజుల ఈ-టూరిస్ట్ వీసా ప్రకటించారు.  ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఉచిత 30 రోజుల ఈ-టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని, ఇందుకు ఎలాంటి రుసుము ఉండదని చెప్పారు. 

ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు విజన్ 2030 డాక్యుమెంట్‌పై భారత్-రష్యా సంతకాలు చేసినట్టు మోదీ తెలిపారు. ఇందువల్ల ఇరుదేశాల్లో మరిన్ని వాణిజ్య సముదాయాలు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇండియా-రష్యా బిజినెస్ ఫోరంలో కూడా తామిరువురూ పాల్గొంటున్నామని, రెండుదేశాల ఆర్థిక సంబంధాలను ఈ ఫోరం మరింత పటిష్టం చేస్తుందనే నమ్మకం తనకుందని చెప్పారు.

కీలక ఒప్పందాలు ఇవే!

  • ఇంధన సరఫరా : రష్యా భారతదేశానికి నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. పుతిన్ మాట్లాడుతూ, “అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం ఇంధనాన్ని నిరంతరాయంగా రవాణా చేయడానికి మేము” సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
  • పారిశ్రామిక సహకారం : రష్యాలో యూరియా ప్లాంట్​ను స్థాపించడానికి భారత కంపెనీలు, రష్యాకు చెందిన యూరల్​చెమ్​తో ఒప్పందం చేసుకున్నాయి.
  • ఆహార భద్రత & వినియోగదారుల రక్షణ : భారతదేశానికి చెందిన ఎఫ్​ఎస్​ఎస్ఏఐ, రష్యాకు చెందిన వినియోగదారుల రక్షణ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది.
  • ఆరోగ్య రంగం : వైద్యం, ఆరోగ్య సంరక్షణలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
  • పోర్టు అండ్ షిప్పింగ్ : సీ లాజిస్టిక్స్​లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్, రష్యాలు ఎంవోయూపై సంతకాలు చేశాయి.
  • వలసలు : ఇరుదేశాల మధ్య వలసలు, మొబిలిటీని సులభతరం చేసేందుకు కూడా భారత్​, రష్యాలు ఓ అంగీకారానికి వచ్చాయి.
  • వీటికి అదనంగా, కొత్త అంతర్జాతీయ లాజిస్టిక్స్ మార్గాలను నిర్మించడానికి రష్యా, భారత్​తో కలిసి పనిచేస్తోందని పుతిన్ అన్నారు. చిన్న మాడ్యూలర్​ న్యూక్లియర్ రియాక్టర్లు, తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

వ్యూహాత్మక భాగస్వామ్యం
వాస్తవానికి ఇండియా, రష్యా మధ్య పౌర అణుశక్తి, కీలకమైన ఖనిజాల విషయంలో దశాబ్దాలుగా పరస్పర సహకారం కొనసాగుతూ ఉంది. దీనికి తోడు ధృవాల వద్ద భారత నావికులకు రష్యా శిక్షణ ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్కిటిక్​లో సహకారాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలు కూడా ఈ ఒప్పందాల్లో భాగంగా ఉన్నాయి. 

కాగా, ఇకపై భారత్​, రష్యా మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు పెంచాలని పుతిన్ పేర్కొన్నారు. జాతీయ కరెన్సీల్లో వాణిజ్యాన్ని స్థిరీకరించడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.