దేవాలయాల ప్రయోజనాలు కాపాడే విషయంలో మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దేవాలయాలు, ఛారిటబుల్ సంస్థలలో అక్రమాలు, మైనర్ల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు సుమోటోగా జోక్యం చేసుకొని తగిన ఆదేశాలిచ్చే అధికారం న్యాయస్థానాలకు ఉందని తేల్చి చెప్పింది. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడం పెద్ద వ్యవహారంతో ముడిపడి ఉందని పేర్కొంది.
నిందితుడు సీవీ రవికుమార్‌తో అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి(ఏవీఎస్వో) వై.సతీష్‌కుమార్ లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకునే అధికారం లేదని మాత్రమే హైకోర్టు సింగిల్ జడ్జి ప్రాథమికంగా అభిప్రాయపడ్డారని తెలిపింది. అంతిమంగా లోక్ అదాలత్ ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చేందుకు ఇద్దరు న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనానికి సింగిల్ జడ్జి నివేదించారని గుర్తుచేసింది.
సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముందని వ్యాఖ్యానించింది. వాదనల కొనసాగింపునకు విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో చోటు చేసుకున్న చోరీ కేసును ఫిర్యాదుదారుడు సతీష్‌కుమార్, నిందితుడు సీవీ రవికుమార్ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్న వ్యవహారాన్ని సీఐడీతో దర్యాప్తు చేయించాలంటూ పాత్రికేయుడు ఎం.శ్రీనివాసులు వేసిన వ్యాజ్యంపై ఈ ఏడాది అక్టోబర్ 27న హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపారు.
కేసు రాజీ విషయంలో టీటీడీ బోర్డు, టీటీడీ అధికారులు, దర్యాప్తు అధికారి(ఐవో), ఫిర్యాదుదారుడు సతీష్‌కుమార్ పాత్రపై దర్యాప్తు చేయాలని సీఐడీ డీజీని ఆదేశించారు. మరోవైపు నిందితుడు సీవీ రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు కూడబెట్టిన స్థిర, చరాస్తులతోపాటు బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీని ఆదేశించారు.
రిజిస్ట్రేషన్లు మరే ఇతర మార్గాల ద్వారా రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు విక్రయించిన, ఇతరులకు కేటాయించిన ఆస్తులపై దర్యాప్తు చేయాలని, ఆదాయానికి తగ్గట్టే వారు ఆస్తులు ఆర్జించారా? లేదా? అనే కోణంలో దర్యాప్తు ఉండాలని స్పష్టంచేశారు. లోక్ అదాలత్ ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే వ్యవహారాన్ని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించిన విషయం తెలిసిందే.
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ నిందితుడు సీవీ రవికుమార్ వేసిన అప్పీల్‌తోపాటు లోక్ అదాలత్ ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చేందుకు సుమోటోగా నమోదు చేసిన వ్యాజ్యంపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. గురువారం జరిగిన విచారణలో రవికుమార్ తరఫున సీనియర్ న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్న వ్యవహారంపై విచారణ జరిపే పరిధి హైకోర్టు సింగిల్ జడ్జికి లేదని తెలిపారు. లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధత తేల్చే అధికారం కేవలం ధర్మాసనం పరిధిలోదని పేర్కొన్నారు.
సింగిల్ జడ్జి పిటిషన్‌పై విచారణ జరపకుండా మొదట్లోనే దానిని ధర్మాసనానికి నివేదించి ఉండాల్సిందని చెప్పారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే లోక్ అదాలత్ అవార్డును దాదాపు కొట్టేసినట్లు ఉందని తెలిపారు. పైగా, రవికుమార్ టీటీడీ ఉద్యోగి కాదని టీటీడీ ఈవో హైకోర్టులో కౌంటర్ వేశారని గుర్తు చేశారు. పెద జీయర్ మఠంలో రవికుమార్ గుమస్తా అని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగి (పబ్లిక్ సర్వెంట్) నిర్వచనం పరిధిలోకి రారని, ప్రభుత్వ ఉద్యోగికాని వ్యక్తి ఆస్తుల విషయంలో దర్యాప్తు చేయాలని సింగిల్ జడ్జి ఏసీబీని ఆదేశించడానికి వీల్లేదని చెప్పారు. సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రస్తుత పిటిషన్లలో ప్రతివాదిగా చేరేందుకు అనుమతివ్వాలంటూ ఇంప్లీడ్ పిటిషన్ వేశామని, దానిని అనుమతించాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ఈ అభ్యర్థనను తదుపరి విచారణలో పరిశీలిస్తామని పేర్కొంది.
More Stories
పాకిస్థాన్ తొలి సిడిఎఫ్ గా అసిమ్ మునీర్
అమెరికాది ఒప్పు.. భారత్‌ది తప్పా?
ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన మోదీ