పాకిస్థాన్ తొలి రక్షణ బలగాల అధిపతిగా సైనాధ్యక్షుడు అసిమ్ మునీర్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సిఫార్సు మేరకు ఆయన నియామకానికి దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోద ముద్ర వేశారు. మునీర్ ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. సీడీఎఫ్ పదవిని కొత్తగా ఏర్పాటు చేస్తూ పాక్ పార్లమెంటు గత నెలలో 27వ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది.
జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ పదవిని రద్దు చేసి, ఆ స్థానంలో సీడీఎఫ్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదనంగా, పాకిస్థాన్ అధ్యక్షుడు ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ డిఫెన్స్ సేవలో రెండేళ్ల పొడిగింపును కూడా ఆమోదించారు. ఇది మార్చి 19, 2026 నుంచి అమలులోకి రానుంది. పాకిస్థాన్ సాయుధ దళాల అధికారి ఆసిఫ్ అలీ జర్దారీ ఇద్దరికీ తన శుభాకాంక్షలను తెలిపారు.
ఈ సంవత్సరం ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి పొందిన అసిమ్ మునీర్, సీడీఎఫ్ విధులతో పాటు ఆర్మీ చీఫ్ పదవిని కూడా ఏకకాలంలో నిర్వహిస్తారు. 1965లో భారతదేశంతో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌కు నాయకత్వం వహించిన జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత ఫీల్డ్ మార్షల్ పదవిని పొందిన రెండో సైనిక అధికారిగా ఆసిమ్ నియమితులయ్యారు. తాజాగా ఇప్పుడు సీడీఎఫ్ అయ్యారు.
ఈ నియామకంతో పాక్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా మునీర్ ఉండనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణను పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో మునీర్ కొనసాగనున్నారు. సీడీఎఫ్‌గా అసిమ్ మునీర్‌ను ప్రకటించడానికి ముందు పలు ఊహాగానాలు వచ్చాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పలు వార్తలు కూడా వచ్చాయి.
అంతకుముందు, పాకిస్థాన్ ప్రభుత్వం సీడీఎఫ్‌గా మునీర్ నియామకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను ఆలస్యం చేసినప్పుడు, భారత జాతీయ భద్రతా సలహా బోర్డు మాజీ సభ్యుడు తిలక్ దేవషేర్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ఉద్దేశపూర్వకంగా నోటిఫికేషన్ జారీ చేయకుండా తప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, పిఎంఎల్-ఎన్ చీఫ్ ఆర్గనైజర్ మరియం నవాజ్ ల మధ్య జరిగిన తీవ్రమైన చర్చల తర్వాతే ఈ నియామకం ఆమోదం పొందింది. మునీర్ కొత్త పదవిని ప్రాసెస్ చేయడంలో జాప్యం షరీఫ్ కుటుంబానికి, టాప్ జనరల్‌కు మధ్య పెద్దఎత్తున ఆధిపత్య పోరు నడిచినట్లు చెబుతున్నారు.
షరీఫ్‌లు భవిష్యత్తులో రాజకీయ హామీలు, సైనిక మద్దతు హామీని కోరుతున్నట్లు సమాచారం. “అసిమ్ మునీర్ సిఓఏఎస్, సీడీఎఫ్ రెండింటిలోనూ ఐదేళ్ల పదవీకాలం కోరుకుంటే, అతను నవాజ్ షరీఫ్‌కు ప్రధాన పదవికిహామీ ఇవ్వాలి” అని ఆ వర్గాలు సూచిస్తున్నాయి. దీని వలన నియామకం ఒక సంస్థాగత నిర్ణయంలా కాకుండా, రెండు వైపులా పరస్పరం తమ హోదాలను కాపాడుకునేందుకు జరిగిన రాజకీయ లావాదేవీలా కనిపిస్తుంది.

More Stories
దేవాలయాలకు మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే
అమెరికాది ఒప్పు.. భారత్‌ది తప్పా?
ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన మోదీ