బాబ్రీ నమూనా నిర్మిస్తాన‌న్న టీఎంసీ ఎమ్మెల్యే స‌స్పెన్ష‌న్‌

బాబ్రీ నమూనా నిర్మిస్తాన‌న్న టీఎంసీ ఎమ్మెల్యే స‌స్పెన్ష‌న్‌
పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ బాబ్రీ మసీదుకు సంబంధించిన నమూనా మసీదును నిర్మిస్తానని ప్రతిపాదించిన ముర్షిదాబాద్‌కు చెందిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.  ముర్షిదాబాద్‌లోని ఏదో ఒక ప్రాంతంలో బాబ్రీ మసీదుకు చెందిన నమూనా మసీదును నిర్మించాలనే ప్రతిపాదనను ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అకస్మాత్తుగా తెరపైకి తేవడం రాజకీయ దుమారం రేపింది.
కోల్‌కతా మేయర్, సీనియర్ తృణమూల్ నాయకుడు ఫిర్హాద్ హకీమ్ ఈ సస్పెన్షన్ నిర్ణయాన్ని ధృవీకరించారు. హుమాయున్ కబీర్ చేసిన ఈ ప్రతిపాదన పట్ల పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  “ముర్షిదాబాద్‌కు చెందిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అకస్మాత్తుగా బాబ్రీ మసీదును నిర్మిస్తానని చెప్పినట్లు మేము గుర్తించాం. ఇప్పుడు ఎందుకు బాబ్రీ మసీదు అవసరం వచ్చింది? ఇది అనవసరమైన వివాదాలను సృష్టిస్తుంది” అని ఫిర్హాద్ హకీమ్ వ్యాఖ్యానించారు. 
పార్టీ అధిష్టానం ఇప్పటికే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌కు ఈ అంశంపై ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది.  అయినప్పటికీ ఆయన తన వైఖరిని మార్చుకోకపోవడం, సున్నితమైన అంశాన్ని లేవనెత్తడంతో పార్టీ క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించి చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
సున్నితమైన మతపరమైన అంశాలకు సంబంధించిన ప్రకటనలు చేయడం ద్వారా శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే తృణమూల్ కాంగ్రెస్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ సస్పెన్షన్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ముఖ్యంగా ముర్షిదాబాద్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.