రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ రాణించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్, కింగ్ కోహ్లీ సెంచరీలతో కదం దొక్కగా, చివరలో కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ధాటిగా బ్యాంటింగ్ చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాకు 359 పరుగుల టార్గెట్‌ను విధించింది. అయితే, సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. 359 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 49.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించారు.
దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన తర్వాత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (14) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ జైస్వాల్ (22) సైతం పెవిలియన్‌కు చేరుకున్నాడు.
విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ జోడీ స్కోర్‌ను పరుగులెత్తించారు. రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మరో వికెట్ పడగకుండా జాగ్రత్త పడుతూ పరుగుల వరద పారించారు. ఈ క్రమంలోనే రుతురాజ్ కేవలం 77 బంతుల్లోనే కెరీర్‌లో రెండో సెంచరీని నమోదు చేశాడు. 82 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 105 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో విరాట్ సైతం అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. రాంచీ వన్డేలో సెంచరీతో కదం తొక్కిన విరాట్ అదే ఫామ్‌తో రాయ్‌పూర్ వన్డేలో చెలరేగాడు.
ఈ క్రమంలో వన్డేలో కింగ్ కోహ్లీ 93 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 102 పరుగులు చేశాడు. రుతురాజ్-విరాట్ జోడీ మూడో వికెట్‌కు అజేయంగా 156 బంతుల్లో 195 పరుగులు చేశాడు. ఇక చివరలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం 43 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేఎల్ రాహుల్‌కు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (24) సహకారం అందించాడు.
దాంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్‌కు రెండు, బర్గర్, ఎన్గిడికి చెరో వికెట్ దక్కింది. ఇక వన్డేల్లో దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇది రెండో భారీ స్కోర్. 2010లో గ్వాలియర్ వన్డేలో మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. దక్షిణాాఫ్రికా ఓపెనర్ ఐదెన్ మార్‌క్రమ్ (110; 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకంతో అదరగొట్టాడు.
మాథ్యూ బ్రిట్జ్కే (68; 64 బంతుల్లో 5 ఫోర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (54; 34 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో మెరవగా, తెంబా బావుమా (46; 48 బంతుల్లో) రాణించాడు. చివర్లో టోని డి జోర్జి (17; రిటైర్డ్ హర్ట్), కోర్బిన్ బాష్ (26*), కేశవ్ మహరాజ్ (10*) పరుగులు చేసి విజయతీరాలకు చేర్చారు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. ఈ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ శనివారం (డిసెంబర్ 6న) విశాఖపట్నంలో జరగనుంది.

More Stories
భారత్ తటస్థంగా ఉండదు…శాంతికే మద్దతు
వికసిత్ భారత్ కు అవసరమైన ప్రతి సహకారం అందిస్తాం
2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్- రష్యా వాణిజ్యం