భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రజల నిధులను ఉపయోగించి నెహ్రూ బాబ్రీ మసీదు నిర్మించాలని అనుకున్నారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. అయితే, దీనిని సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఇది జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇంకా పటేల్ మరణానంతరం ఆయన స్మారకం కోసం ప్రజలు సేకరించిన నిధులను రోడ్లు, బావుల కోసం వినియోగించాలని నెహ్రూ సూచించినట్లు చెప్పారు.
సర్దార్ వల్లాభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ వడోదరలో నిర్వహించిన ఐక్యతా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. “ప్రజల సొమ్ముతో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించాలని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అనుకున్నారు. ఈ ప్రతిపాదనను అడ్డుకున్న వ్యక్తి గుజరాతీ బిడ్డ సర్దార్ వల్లాభాయ్ పటేల్. ప్రజల నిధులతో మసీదు కట్టడానికి పటేల్ అసలే అంగీకరించలేదు” అని తెలిపారు.
“దీంతో గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి నెహ్రూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పటేల్, అది పూర్తిగా విభిన్నమైన అంశమని చెప్పారు. ఇందుకోసం ట్రస్టును ఏర్పాటుచేసి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్మును తీసుకోకుండా సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు. అచ్చం అలాగే అయోధ్యలోని రామమందిరాన్ని ప్రభుత్వ నిధుల లేకుండానే నిర్మించాం. ఆ ఆలయ నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం దేశ ప్రజల నుంచే సేకరించారు. ఇదీ అసలైన సెక్యూలరిజం” అని రక్షణ మంత్రి గుర్తు చేశారు.
వాస్తవానికి సర్దార్ పటేల్ దేశానికి తొలి ప్రధానమంత్రి కావాలని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కానీ ఆయన తన రాజకీయ కెరీర్ లో ఎప్పుడూ హోదాల కోసం పాకులాడలేదని తెలిపారు. ప్రధానమంత్రి అయ్యేందుకు పటేల్కు వయసు అడ్డంకిగా మారిందన్న వాదనలను రాజ్నాథ్ సింగ్ తోసిపుచ్చారు. 80 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ దేశానికి ప్రధాని అయినప్పుడు, అంతకంటే తక్కువ వయసున్న పటేల్కు ఎందుకు అర్హత ఉందని ప్రశ్నించారు.
నెహ్రూతో ఆయనకు అనేక సైద్ధాంతిక విబేధాలు ఉన్నా, మహాత్మా గాంధీకి ఇచ్చిన మాట కోసం కలిసి పని చేశారని గుర్తు చేసుకున్నారు. గాంధీ సూచనల మేరకు పటేల్ విరమించుకుంటేనే 1946లో నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని చెప్పారు. పటేల్ ఖ్యాతిని చెరిపివేసేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నించారని ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే రక్షణ మంత్రి విమర్శించారు.
కానీ, బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు వారి ప్రయత్నాలు విజయవంతం కావని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. “1946లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. అందులో మెజారిటీ సభ్యులు వల్లాభాయ్ పటేల్ పేరును ప్రతిపాదించారు. కానీ గాంధీజి వచ్చి నెహ్రూను అధ్యక్షుడిగా చేయాలని, అందుకోసం పటేల్ను తప్పుకోవాలని సూచించారు. దీనికి అంగీకరించిన పటేల్ వెంటనే తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారు” అని చెప్పారు.
” పటేల్ మరణానంతరం ఆయన స్మారకం కోసం పౌరులు నిధులు సేకరించారు. ఈ విషయం నెహ్రూకు తెలియగానే, పటేల్ రైతుల నేతని, అందుకోసం ఈ నిధులను గ్రామాల్లో బావులు, రోడ్లకు ఉపయోగించాలని చెప్పారు. వాస్తవానికి బావులు, రోడ్లను నిర్మించడం ప్రభుత్వ బాధ్యత. ఎలాగైనా పటేల్ ఖ్యాతిని అణగదొక్కాలని అప్పటి ప్రభుత్వం భావించింది” అని ధ్వజమెత్తారు.
నెహ్రూజీ స్వయంగా ఆయనే భారతరత్న ఇచ్చుకున్నారని గుర్తు చేస్తూ కానీ సర్దార్ వల్లాభాయ్ పటేల్కు ఎందుకు భారతరత్న ఇచ్చి గౌరవించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ మాత్రం స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మించి వల్లాభాయ్ పటేల్కు దక్కాల్సిన గౌరవాన్ని అందించారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.

More Stories
దివ్యంగుల హక్కుల సంరక్షణ సమాజ నిర్మాణంలో మౌలికం
చాయ్ అమ్ముతున్న ప్రధాని మోదీ వీడియోపై దుమారం
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులలో 7 బిజెపి కైవసం