దివ్యాంగజన హక్కుల పరిరక్షణ న్యాయసమ్మతమైన, పురోగమించే సమాజ నిర్మాణానికి అత్యంత మౌలికమైనది అని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ & స్పైన్ సర్జన్ డా. నవీన్ మెహ్రోత్రా తెలిపారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని `మానస’ చిన్నారుల ఆరోగ్య వైకల్యాల అధ్యయన సంస్థలో “దివ్యాంగజన సమ్మిళతతో సామాజిక పురోగతి” అనే అంశంపై బుధవారం జరిగిన సెమినార్లో పాల్గొంటూ విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమాజంలో పాల్గొనడం వంటి అవకాశాలు సమానంగా లభిస్తే, దివ్యాంగుల సామర్థ్యాలు సమాజపు పురోగతికి విశేషంగా దోహదపడతాయని చెప్పారు.
అందుకోసం సమగ్ర విధానాలు, మౌలిక సదుపాయాల అందుబాటు, సహాయక దృక్పథం అవసరమని ఆయన సూచించారు. ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికత, దివ్యాంగ హక్కుల రంగాల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని, సకాలంలో జోక్యం, దివ్యాంగులకు సమాన అవకాశాల కల్పన ప్రాముఖ్యతను వివరించారు. బిర్లా సైన్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా. కె. మృత్యుంజయ రెడ్డి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలు, సామాజిక వాతావరణాలలో దివ్యాంగులకు అనుకూలమైన, సమగ్రతతో కూడిన ఏర్పాట్లు అత్యవసరమని చెప్పారు.
మానస ప్రత్యేక పిల్లలు, వారి కుటుంబాలు, సిబ్బంది బిర్లా ప్లానేటోరియంను సందర్శించేందుకు ఆహ్వానిస్తూ, వారికి ప్రత్యేక శ్రద్ధతో ఆతిథ్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
కాగ్నిటివ్బోటిక్స్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ ఉదయ్ కుమార్ డింట్యాల న్యూరోడైవర్స్ పిల్లల కోసం టెక్నాలజీ ఆధారిత, మనోభావపూర్వకమైన ఎకోసిస్టమ్ దిశగా తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.
ఆటిజం, ఏకాగ్రతలోపం,పెరుగుదలలో ఆలస్యం, బుద్ధిమాంద్యం సంబంధిత పరిస్థితులున్న పిల్లల కోసం రూపొందించిన ఏఐ ఆధారిత లెర్నింగ్, థెరపీ–సపోర్ట్ ప్లాట్ఫామ్ “కాగ్నిటివ్బోటిక్స్”ను పరిచయం చేస్తూ, శాస్త్ర సాంకేతికతను మానవీయతతో కలపడం ఎంతో ముఖ్యం అని పేర్కొన్నారు.
ఈ ప్లాట్ఫారం వినియోగంపై థెరపిస్టులకు ఉచిత శిక్షణ అందించేందుకు సిద్ధమని, అలాగే దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ద్రుష్టి పెట్టవలసిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. జన్యు శాస్త్రం పిల్లల ఆరోగ్యంలో చేసే పాత్రపై మాట్లాడుతూ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఇన్ ఛార్జ్ డైరెక్టర్ డా. బి. విజయలక్ష్మి జన్యు ప్రొఫైలింగ్ ద్వారా పిల్లల్లో ఎదుగుదల ఆలస్యం, వికలాంగతలకు కారణమయ్యే మూల సమస్యలను గుర్తించవచ్చని చెప్పారు. దీనివల్ల ఖచ్చితమైన నిర్ధారణ, లక్ష్యిత జోక్యాలు సాధ్యమవుతాయని తెలిపారు.
బేగంపేటలోని ఇన్స్టిట్యూట్ ప్రత్యేక పిల్లలకు జన్యు పరీక్షల సదుపాయాలు అందించేందుకు సాయపడుతుందని, గర్భిణీ స్త్రీలకు ప్రాధాన్యతాత్మక సేవలు అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. గర్భధారణ సమయంలో జన్యు పరీక్షలు చేయడం ద్వారా శిశువులో ఉండే జన్యు లేదా క్రోమోసోమ్ సంబంధిత పరిస్థితులను ముందుగానే తెలుసుకోవచ్చని, ఇది కుటుంబాలకు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడుతుందని ఆమె వివరించారు.
డిస్లెక్సియా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపకురాలు శ్రీమతి మణిషా గోగ్టే, విభిన్న అవసరాల పిల్లలను శక్తివంతం చేయడానికి మానస చేస్తున్న కృషిని అభినందించారు. ఉపాధ్యాయులు, థెరపిస్టులు, సిబ్బంది, తల్లిదండ్రుల నిబద్ధత మానస ఎదుగుదలకు మూలబలం అని ఆమె పేర్కొన్నారు. పిల్లల కోసం మరింత సమగ్రతతో కూడిన మెరుగైన భవిష్యత్తు నిర్మించడంలో తమ అసోసియేషన్ పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో ప్రత్యేక పిల్లలు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరికీ ఆనందాన్ని పంచాయి. ఈ సందర్భంగా కె. నరసింహారావు తదితరులు మానస సేవా కార్యక్రమాలకు విరాళాలు అందించారు. సెమినార్లో `మానస’ అధ్యక్షులు డా. బి. దినేష్ కుమార్, ప్రిన్సిపాల్ శ్రీమతి జి. విజయ భాను, క్లినికల్ కోఆర్డినేటర్ శ్రీమతి బి. అనిత, ప్రత్యేక ఎడ్యూకేటర్లు, థెరపిస్టులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
More Stories
హిందూ దేవీదేవతలపై రేవంత్ వాఖ్యలపై బిజెపి నిరసనలు
చాయ్ అమ్ముతున్న ప్రధాని మోదీ వీడియోపై దుమారం
రష్యా- భారత్ సైనిక విన్యాసాల కోసం దళాలు, యుద్ధ నౌకల మార్పిడి?