రష్యా- భారత్ సైనిక విన్యాసాల కోసం దళాలు, యుద్ధ నౌకల మార్పిడి?

రష్యా- భారత్ సైనిక విన్యాసాల కోసం దళాలు, యుద్ధ నౌకల మార్పిడి?
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగే భేటీలో సుఖోయ్ ఎస్ యూ-57 స్టెల్త్ ఫైటర్లు, అదనపు ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థలపై చర్చలు వంటి ప్రధాన రక్షణ వేదికలు ఎజెండాలో ఉన్నాయని క్రెమ్లిన్ ధృవీకరించిన ఒక రోజు తర్వాత, భారతదేశంతో కీలకమైన సైనిక సహకార ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు రష్యా వేగంగా ముందుకు వచ్చింది.
 
డిసెంబర్ 4–5 తేదీలలో పుతిన్ న్యూఢిల్లీ పర్యటనకు కొన్ని రోజుల ముందు, రష్యా పార్లమెంట్ దిగువ సభ అయిన స్టేట్ డూమా, రెసిప్రోకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ (ఆర్ఈఎల్ఓఎస్ -reLOS) ఒప్పందాన్ని ఆమోదించింది. ఫిబ్రవరి 18న మొదట సంతకం చేసి, గత వారం ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ ఆమోదం కోసం పంపిన ఈ ఒప్పందంలో భారతదేశం,రష్యా మధ్య సైనిక యూనిట్లు, యుద్ధనౌకలు, విమానాల మోహరింపుకు సంబంధించిన విధానాన్ని నిర్దేశిస్తుంది.
 
ఇంధనం, నిర్వహణ నుండి బెర్తింగ్, సరఫరాలు, కార్యాచరణ సహాయం వరకు ఇరుపక్షాలు ఒకరికొకరు అందించగల లాజిస్టికల్ మద్దతు పూర్తి స్పెక్ట్రమ్‌ను కూడా ఇది నిర్దేశిస్తుంది. డూమా ప్లీనరీ సమావేశంలో, స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ ఈ చర్య వ్యూహాత్మక విలువను వివరిస్తూ, ఈ ఆమోదం లోతైన పరస్పరం, దీర్ఘకాలిక సహకారం వైపు మరో అడుగును సూచిస్తుందని పేర్కొన్నారు. 
 
ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణా మిషన్లు, మానవతా సహాయ కార్యకలాపాలు, సహజ లేదా మానవ నిర్మిత విపత్తు సహాయ చర్యలు, రెండు ప్రభుత్వాలు పరస్పరం ఆమోదించిన ఏ ఇతర పరిస్థితిలోనైనా ఈ ఒప్పందం వర్తిస్తుంది. డూమా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన నోట్ ప్రకారం, ఈ ఆమోదం ఒకరి వైమానిక ప్రదేశానికి ప్రాప్యతను సులభతరం చేస్తుంది.  రష్యన్, భారతీయ నావికా నౌకలు చాలా సులభంగా పోర్ట్ కాల్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
 
పుతిన్ వచ్చే వారం న్యూఢిల్లీకి రానున్న సందర్భంగా ఈ ఒప్పందం ఆమోదం మాస్కో భారతదేశంతో దాని దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. సుఖోయ్ సు-57 స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లతో సహా ప్రధాన రక్షణ ఒప్పందాలపై చర్చిస్తారని భావిస్తున్నారు.
 
“ఈ పర్యటన సందర్భంగా దీనిపై చర్చ జరుగుతుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. రాబోయే పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఎస్ యు-57ల అంశం ఖచ్చితంగా ఎజెండాలో ఉంటుంది” అని పెస్కోవ్ పేర్కొన్నారు. బాహ్య జోక్యం లేకుండా ద్వైపాక్షిక సంబంధం ప్రాముఖ్యతను పెస్కోవ్ నొక్కిచెప్పారు. “మన సంబంధాన్ని మనం కాపాడుకోవాలి; పరస్పర ప్రయోజనాన్ని తెచ్చే మన వాణిజ్యాన్ని మనం కాపాడుకోవాలి” అని ఆయన చెప్పారు. 
 
ఎస్ యు57 ప్లాట్‌ఫామ్ చుట్టూ నిర్మించబడిన ఎఫ్ జి ఎఫ్ ఏ (ఐదవ తరం ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్) కార్యక్రమంలో భారతదేశం ప్రారంభంలో ప్రధాన సహకారిగా ఉంది.  స్టీల్త్, ఏవియానిక్స్, ఇంజిన్ అప్‌గ్రేడ్‌లకు సంబంధించిన అవసరాలను రూపొందించడంలో పాత్ర పోషించింది. అయితే, ఖర్చు, సాంకేతిక భాగస్వామ్యం,  పనితీరు లోపాల కారణంగా, భారతదేశం తన భాగస్వామ్యాన్ని నిలిపివేసి, తరువాత ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించింది.
 
అయినప్పటికీ, ఎస్ యూ-57 భారతదేశం, రష్యా మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక సంభాషణలో భాగంగా ఉంది. భారతదేశం, రష్యా మొదట 2018లో ఎస్-400 వ్యవస్థ కోసం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది అధునాతన వాయు రక్షణ వేదిక ఐదు యూనిట్లకు $5 బిలియన్ల విలువైన ఒప్పందం. ఇప్పటివరకు, ఐదు స్క్వాడ్రన్‌లలో మూడు ఇప్పటికే పంపిణీ చేశారు.