రెండు దశల్లో డిజిటల్ విధానంలో ‘జన గణన’

రెండు దశల్లో డిజిటల్ విధానంలో ‘జన గణన’

దేశంలో జనగణన రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2026 ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జన గణన జరుగుతుందని మంగళవారం లోక్సభకు తెలిపింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నకు, హోమ్ వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇస్తూ, జన గణన గురించి తెలిపారు. 

జన గణన మొదటి దశలో హౌస్ లిస్టింగ్, సెన్సెన్స్, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ‘మొదటి దశ జన గణన 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. అయితే ఆయా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సౌలభ్యానికి అనుగుణంగా 30 రోజుల వ్యవధిలోనే సెన్సెస్ నిర్వహణ ఉంటుందని’ నిత్యానంద్ రాయ్ చెప్పారు. “జన గణన 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 మధ్యలో జరుగుతుంది. అయితే లద్ధాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచుతో కప్పపడే నాన్-సింక్రోనస్ ప్రాంతాల్లో జన గణన 2026 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 1 మధ్య జరుగుతుంది” అని నిత్యానంద్ రాయ్ లోక్సభకు తెలిపారు.

ఈ ప్రక్రియకు ముందు వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు, సంస్థలు, సెన్సెస్ డేటా యూజర్ల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు ఆధారంగా జన గణన ప్రశ్నాపత్రాన్ని రూపొందించినట్లు మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. మన దేశంలో జన గణనకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, ఇంతకు ముందు నిర్వహించిన జనాభా లెక్కల నుంచి నేర్చుకున్న పాఠాలను తదుపరి జన గణన కోసం పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఈ ఏడాది ఏప్రిల్ 30న రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించిన విధంగా, కుల గణన కూడా ఈ జనాభా గణనలోనే జరుగుతుందని నిత్యానంద్ రాయ్ లోక్సభకు తెలిపారు. మరో ప్రశ్నకు జవాబిస్తూ, 2027 జనాభా లెక్కింపు డిజిటల్ వేలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొబైల్ యాప్ల ద్వారా డేటాను సేకరిస్తామని, స్వీయ గణనకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఈ డిజిటల్‌ విధానంతో జనాభా లెక్కించేందుకు అధికారులతోపాటు ప్రజలకూ అవకాశం ఇవ్వనున్నారు. ఇంతకు మునుపే రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం పౌరులను అడగడానికి దాదాపు 30కిపైగా ప్రశ్నలను సిద్ధం చేసింది.  ఈ సర్వేలో ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు (సైకిల్, స్కూటర్, బైక్, కారు, జీప్, వ్యాన్), గృహోపకరణాలు (రేడియో, టీవీ, ట్రాన్సిస్టర్) వంటి వస్తువుల యాజమాన్యం గురించి ప్రజలను అడుగుతారు.

తృణధాన్యాల వినియోగం, తాగునీటి వనరులు, లైటింగ్, మరుగుదొడ్లు వాడకం, స్నానం, వంటగది సౌకర్యాలు, వంట కోసం ఉపయోగించే ఇంధనం, ఎల్పీజీ/పీఎన్జీ కనెక్షన్ గురించి కూడా అడుగుతారు. ఇంటి ఫ్లోరింగ్, గోడలు, పైకప్పు కోసం ఉపయోగించిన మెటిరీయల్, నివాసితుల సంఖ్య, ఇంటి గదుల సంఖ్య, ఇంటి యజమాని గురించి ప్రశ్నలు ఉంటాయి.