హిందూ దేవీదేవతలను అవమానించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బీజేపీ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి. పీసీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి నాయకత్వంలో బిజెవైఎం, మహిళా మోర్చా కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరగా, పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బిజెపి శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అడ్డుకునే సమయంలో జరిగిన తోపులాటలో పలువురు మహిళా మోర్చా, బిజెవైఎం నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. శాంతియుత నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసుల దురుసుగా వ్యవహరించడం పట్ల బిజెపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ దేవతలను అవమానించే వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన మానవ హక్కు. దానిని క్రూరంగా అణచివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. హిందువులకు సంబంధించిన దేవీ దేవతలను, హిందూ సమాజాన్ని అవహేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీగా బయలుదేరిన మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని డా. శిల్పారెడ్డి తీవ్రంగా ఖండించారు.
హిందూ దేవుళ్లను అవమానిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం అని బిజెపి ఎంపీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు తానే గొప్ప హిందువునంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డికి అధికారంలోకి రాగానే హిందువుల మనోభావాలను అవహేళన చేయడం సిగ్గు చేటని ఆమె చెప్పారు.

More Stories
దివ్యంగుల హక్కుల సంరక్షణ సమాజ నిర్మాణంలో మౌలికం
హిందూ దేవుళ్లను కించపరిచిన రేవంత్..బీజేపీ నిరసనలు నేడే
కోమటిరెడ్డి చొరవతో మునుగోడులో ఊరి బైట మద్యం షాపులు