హిందూ దేవుళ్లను కించపరిచిన రేవంత్..బీజేపీ నిరసనలు నేడే

హిందూ దేవుళ్లను కించపరిచిన రేవంత్..బీజేపీ నిరసనలు నేడే
* పెండ్లి కానోళ్లకు హనుమంతుడు… తాగేటోళ్లకు ఎల్లమ్మ
 
హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు. మూడు కోట్ల మంది దేవుళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొంటూ మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదంటూ కించపరిచారు.
 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళను  అవమాన పరుస్తూ, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు , సిఎం దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు బిజెపి కార్యకర్తలకు, నాయకులకు ,తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.  ఈ  నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కాంగ్రెస్ పాలనలో హిందువులపై, హిందూ దేవుళ్లపై అవహేళనగా మాట్లాడే పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతున్నాయిని,  హిందువులకు అంతమంది దేవుళ్లు అవసరమా? హనుమంతుడికి పెళ్లి కాలేదని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆయన  మండిపడ్డారు.

“హిందువుల్లో ఎంతమంది దేవతలున్నారు. మూడు కోట్ల మంది ఉన్నారా? మరి అన్ని ఎందుకున్నయి? పెండ్లి చేసుకోనోనికి హనుమంతుడున్నాడు. రెండు పెండ్లిండ్లు చేసుకునేటోళ్లకు ఇంకోకాయన దేవుడున్నడు. మందు తాగేటోళ్లకు ఓ దేవుడున్నడు ఎల్లమ్మ, పోచమ్మ. కల్లు పొయ్యాలె, కోడి కొయ్యాలె అనేటోళ్లకు ఓ దేవుడున్నడు. పప్పన్నం తినేటొళ్లకు కూడా దేవుడున్నాడు. అన్ని రకాల దేవుళ్లున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కూడా అన్ని రకాల మనుషులున్నరు” అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

“దేవుడిపైనే ఏకాభిప్రాయంలేదు. ఒకాయన వేంకటేశ్వరస్వామికి మొక్కుతానంటే, మరొకాయన ఆంజనేయస్వామికి మొక్కుతా అంటడు. ఇంకొకాయన లేదు.. లేదు నేను అయ్యప్పమాల వేస్తానంటే, మరో ఆయన శివమాల వేస్తానంటడు. దేవుళ్లమీదనే మనం ఏకాభిప్రాయం తీసుకురానప్పుడు రాజకీయ నాయకుల మీద ఏకాభిప్రాయం ఉంటదని నేను అనుకోను” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 

సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. హిందువులంటే తాగుబోతులు, తిండిబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే తీరు చూస్తే “ముస్లిం ఈజ్ కాంగ్రెస్… కాంగ్రెస్ ఈజ్ ముస్లిం” అనే భావన కలుగుతుందని, మజ్లిస్ సహవాసం చేసిన తర్వాత కాంగ్రెస్ నాయకులలో హిందూ వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. అందుకే ఇలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి! మీరు హిందువని గుర్తు పెట్టుకోండి. మీరు మజ్లిస్‌తో దోస్తానా పెట్టుకోవచ్చు, కానీ హిందువులను, హిందూ దేవీ-దేవతలను ఇలా అవమానపరచడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం” అని రామచందర్ రావు హెచ్చరించారు. 
 
గతంలో బీఆర్ఎస్ హిందూ వ్యతిరేక ధోరణి ప్రదర్శించిందని, అప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా హిందువుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అదేబాటలో నడుస్తోందని ఆయన మండిపడ్డారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
 

హిందువులకు సంబంధించిన దేవీదేవతలను అవహేళన చేస్తూ రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడిన మాటలను చాలా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి  తీవ్రంగా ఖండించారు. ఒక హిందువుగా ఉంటూ, హిందువుల మీద, దేవీదేవతల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవలే జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో కూడా ఓట్ల కోసం దిగజారి కాంగ్రెస్ అంటే ముస్లింలు – ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు.

 
హిందూ దేవుళ్ళ ను తూలనాడిన తెలంగాణ సిఎం హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. దేవతలను, దేవుళ్ళను అవమానకర వ్యాఖ్యలు చేస్తూ నోటికి వచ్చినట్లు దూషించిన రేవంత్ హిందువుల మనోభావాలను కించపరిచారని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేవుళ్ళు పైన ఇష్టానుసారం వర్ణిస్తూ హేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని ఏవత్తు సమాజానికి ఏవగింపు కలిగిందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేకి అనేది అర్థం అవుతుందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువులను, హిందూ దేవుళ్లను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ముమ్మాటికీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాసే పార్టీ అని పేర్కొంటూ  ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నరనరాల్లో హిందూ ద్వేషం నింపుకుందని విమర్శించారు.