బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ అధినేత్రి ఖలేదా జియా ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమె కోలుకోవడానికి భారత్ అన్ని విధాల సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. డాకాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఖలేదా జియా గత వారం రోజులుగా విషమ స్థితిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ప్రధాని మోదీ సోమవారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించారు.
“బంగ్లాదేశ్ ప్రజాజీవితానికి ఎన్నో సంవత్సరాలు సేవలందించిన ఖలేదా జియా ఆరోగ్యం గురించి తెలుసుకుని తీవ్రంగా కలత చెందాను. ఆమె త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అవసరమైతే భారతదేశం అన్ని విధాల సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది,” అని మోదీ పేర్కొన్నారు. 80 ఏండ్ల ఖలీదా నవంబర్ 23న అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ ఆమె ఆరోగ్యం విషమంగానే ఉందని పార్టీ నేతలు వెల్లడించారు. ఖలేదా జియా చికిత్సకు భరోసా కల్పించేందుకు చైనా నుంచి ఐదుగురు వైద్యుల బృందం సోమవారం డాకాకు చేరుకుంది. డాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పర్యవేక్షణలో భాగంగా చైనా వైద్యులు స్థానిక బృందానికి సహకరిస్తున్నారు.
2018లో అవినీతి కేసులో ఖలీదాకు అప్పటి ప్రభుత్వం 17 ఏళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవలే విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో.. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలీదా జియాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కార్యనిర్వాహక ఉత్తర్వులతో విడుదల చేశారు. అంతకుముందు, లండన్‌లో నాలుగు నెలల పాటు వైద్య చికిత్స తీసుకుని ఆమె ఈ ఏడాది మే నెలలోనే ఢాకాకు తిరిగి వచ్చారు. ఇప్పుడు మరోసారి ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఖలేదా జియాను ప్రధాని మోదీ 2015 జూన్‌లో తన బంగ్లాదేశ్ పర్యటన సమయంలో కలిశారు. ఆ సమయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలక భూసరిహద్దు ఒప్పందం కుదిరింది. అప్పట్లో అధికార–ప్రతిపక్ష రాజకీయాలకు అతీతంగా మోదీ ఖలేదా జియాతో సమావేశమయ్యారు.
నాలుగు దశాబ్దాలకు పైగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఖలేదా జియా, 1991లో బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని అయ్యారు. 2001లో మళ్లీ అధికారంలోకి వచ్చి 2006 వరకు దేశాన్ని పాలించారు. ప్రస్తుతం బీఎన్పీ దేశంలో అతిపెద్ద పార్టీగా ఉందని, 2026 ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇవ్వనున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా, దశాబ్ద కాలంగా లండన్‌లో స్వయం ప్రవాసంలో నివసిస్తున్న ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ త్వరలో స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారని ఆమె పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. పార్టీ తాత్కాలిక చైర్మన్ రెహమాన్ “త్వరలో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తారని” బిఎన్‌పి స్టాండింగ్ కమిటీ సభ్యుడు సలావుద్దీన్ అహ్మద్ చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి మరియు రాబోయే ఎన్నికల ప్రచారం కోసం వ్యూహాలను కూడా చర్చించిన బిఎన్‌పి అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సమావేశం తర్వాత ఆయన వ్యాఖ్యలు చేశారు.

More Stories
చాయ్ అమ్ముతున్న ప్రధాని మోదీ వీడియోపై దుమారం
రష్యా- భారత్ సైనిక విన్యాసాల కోసం దళాలు, యుద్ధ నౌకల మార్పిడి?
శ్రీలంకకు కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపిన పాక్