ఉమీద్ ఫోర్టల్‌తో ‘వక్ఫ్ బై యూజర్’ సహా వక్ఫ్ ఆస్తులను నమోదు చేసేందుకు గడువు పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే పిటిషనర్లు సంబంధిత వక్ఫ్ ట్రిబ్యునల్‌ను సంప్రదించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అన్ని వక్ఫ్ ఆస్తులను జియో-ట్యాగింగ్ చేసిన తర్వాత డిజిటల్ జాబితాను రూపొందించడానికి జూన్ 6న కేంద్రం యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ (ఉమీద్) పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ పోర్టల్ ఆదేశం ప్రకారం దేశవ్యాప్తంగా నమోదైన అన్ని వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆరునెలల్లోపు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని, అప్లోడ్ చేసినపుడు వివరాలను నమోదు చేయడం లేదని పిటిషనర్లు వాదించారు. డిసెంబర్ 5తో గడువు ముగుస్తుందని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే భారీ ఆస్తినష్టం జరుగుతుందని వారు పిటిషన్లో పేర్కొన్నారు.
వక్ఫ్ వివరాలను అప్లోడ్ చేసే సమయాన్ని మరో ఆరు నెలలు పొడిగించడం ద్వారా యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్, 1995లోని సెక్షన్ 3బి(1)ని తిరిగి రాయలేమని ధర్మాసనం పేర్కొంది. ఈ ప్రక్రియలో తిరిగి ఇబ్బందులు ఎదురైతే భవిష్యత్తులో సుప్రీంకోర్టులో దరఖాస్తు దాఖలు చేసుకునే స్వేచ్ఛను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ఏదైనా సమస్య ఎదురైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ తమకు ఉందని జస్టిస్ దత్తా వ్యాఖ్యానించారు.

More Stories
రైల్వే యాప్ అన్రిజర్వ్డ్ టికెట్లపై 3% రాయితీ
జపాన్ ను అధిగమించి నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు ఆమోదం