డిజిటల్ అరెస్ట్ మోసాలపై సీబీఐ దర్యాప్తునకు `సుప్రీం’ ఆదేశం

డిజిటల్ అరెస్ట్ మోసాలపై సీబీఐ దర్యాప్తునకు `సుప్రీం’ ఆదేశం

దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై ముందుగా దర్యాప్తు చేపట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇందుకు సంబంధించిన కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా అనుమతి ఇవ్వాలంటూ బంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. హరియాణాలో వృద్ధ దంపతులు డిజిటల్ అరెస్ట్ బారిన పడిన ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు దీని బారిన అధికంగా పడుతున్నారని అభిప్రాయపడింది.

సైబర్ మోసాలకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంలో ఏఐ, మెషీన్ లర్నింగ్ లాంటి సాంకేతికతను ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించింది. ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ జోక్యం చేసుకుని వివరాలు అందించాలని, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సహకారం అందించాలని ఆదేశించింది. పౌరులను మోసం చేయడంలో సహకారం అందించిన బ్యాంక్ అధికారులను గుర్తించాలని సీబీఐకి చెప్పింది. 

ఆఫ్శోర్ ట్యాక్సులు ఉన్న దేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడున్న నేరస్థులను పట్టుకునేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకోవాలని సీబీఐకి సూచించింది. సైబర్ మోసాలకు వాడే అవకాశం ఉన్నందున ఒక వ్యక్తికి అనేక సిమ్లు కేటాయించకుండా టెలికాం ఆపరేటర్లు ఆదేశాలు ఇవ్వాలని టెలికాం మంత్రిత్వ శాఖను అదేశించింది. 

ఆన్లైన్ మోసాలను అడ్డుకునేందుకు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెప్పింది. దీనిపై కేంద్ర హోం, టెలికాం, ఆర్థిక సహా పలు శాఖల స్పందన తెలియజేయాలంటూ సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది. ప్రజలను మోసం చేసే ఖాతాలను ఫ్రీజ్ చేసేలా సీబీఐ సహా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వాలని అభిప్రాయపడింది.

ప్రస్తుతం ఆన్‌లైన్‌ మోసాలు మరింత అధునాతనంగా మారిపోతున్నాయి. దీనికి ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో చేసే మోసమే ఒక ప్రధాన ఉదాహరణ. ఇందులో మోసగాళ్లు చట్టాన్ని అమలు చేసే అధికారులుగా నటిస్తూ, ఇక్కడ వ్యక్తులకు వాట్సాప్/స్కైప్‌ వంటి ప్లాట్‌ఫాంల ద్వారా ఫోన్‌ కాల్‌ చేస్తారు. సీబీఐ, ఆదాయపన్ను అధికారులు లేదా కస్టమ్స్‌ ఏజెంట్ల వలె చెలామణి అయ్యే మోసగాళ్లు ఇక్కడ వ్యక్తులకు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగుతారు. 

మీరు లేదా మీ కుటుంబ సభ్యల్లో ఒకరు మనీలాండరింగ్‌, పన్ను ఎగవేత లేదా మాదకద్రవ్యాల/మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరంలో పాలుపంచుకున్నారంటూ లేదా ఇందులో మీ పేరు/అడ్రస్‌ ఉందంటూ చెబుతారు. మీ ఆధార్‌ కార్డు/పాన్‌ ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని నేర అభియోగిస్తారు. ఈ కేసులో డిజిటల్‌ అరెస్ట్‌ అయ్యారంటూ బెదిరిస్తూ, వ్యక్తిగత బ్యాంకు సమాచారం లేదా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తారు.