టీటీడీ పరిధిలోని ఆలయాల్లోనూ అన్న ప్రసాదాలు

టీటీడీ పరిధిలోని ఆలయాల్లోనూ అన్న ప్రసాదాలు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాల్లోనూ తిరుమల తరహాలో భక్తులకు అన్న ప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిధిలోని ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఈవో సమీక్షించారు.  టీటీడీ పరిధిలోని ఆలయాల్లో అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్న ప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అన్న ప్రసాదాల పంపిణీ సవ్యంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఆలయాల్లో ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలపై రోజు వారీ నివేదికను తయారు చేయాలని తెలిపారు. టీటీడీ ఉద్యోగుల్లో ఇప్పటికీ ఇతర మతాలకు చెందిన వారు ఉంటే వారిని గుర్తించి నివేదిక రూపొందించాలని సింఘాల్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో చేరిన చారిత్రక ఆలయాలకు, ఇతర ఆలయాలకు, ఏయే ఆలయాలకు వేదపారాయణదారులను నియమించాలి? ఎంత మంది అర్చకులను నియమించాలి? అనే అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. 

టీటీడీ పరిధిలోకి వచ్చిన ప్రతి ఆలయానికి సంబంధించి ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ (ఎస్ఓపి) రూపొందించి వచ్చే సమావేశంలో నివేదించాలని చెప్పారు. శ్రీనివాస కల్యాణాలను క్రమంగా నిర్వహించేందుకు వీలుగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్‌ను రూపొందించాలని, తద్వారా భక్తులకు ముందుగానే కల్యాణానికి సంబంధించిన సమాచారం తెలుస్తుందని చెప్పారు. 

అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీవేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 25 ఎకరాల్లో ఇప్పటికే ఉన్న ఆలయంతో పాటు, ఇకపై నిర్మించనున్న కల్యాణ కట్ట, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి, తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఈవో సూచించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఏడు ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ దుర్గమ్మ, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలంలో మాత్రమే ఇప్పటివరకూ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఇతర ఆలయాల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు.  ఇకపై రాష్ట్రంలోని మరో 15 ప్రధాన ఆలయాల్లోనూ అందరికీ అన్నదాన పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం తరహాలో ప్రమాణాలు పాటించనున్నారు.