భారత జనాభాలో 2080 నాటికి స్థిరత్వం

భారత జనాభాలో 2080 నాటికి స్థిరత్వం

భారత దేశ జనాభా 2080 నాటికి 180-190 కోట్ల వద్ద స్థిరపడవచ్చు. రీప్లేస్‌మెంట్‌ లెవెల్‌ (పునఃభర్తీ స్థాయి) కన్నా తక్కువకు సంతానోత్పత్తి రేట్లు నిలకడగా పతనమవుతుండటమే ఇందుకు కారణం. ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ పాపులేషన్‌ (ఐఏఎస్‌పీ) తాజా అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది. 

ఐఏఎస్‌పీ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్రన్‌ తెలిపిన వివరాల ప్రకారం, 20 ఏళ్ల నుంచి జననాల రేట్లు బాగా తగ్గిపోతున్నాయి. 2000వ సంవత్సరంలో టోటల్‌ ఫెర్టిలిటీ రేటు 3.5 కాగా, నేడు అది 1.9కి పడిపోయింది. 2080నాటికి మన దేశ జనాభా 180-190 కోట్ల మధ్య ఉండవచ్చు. ఆ తర్వాత స్థిరపడటం ప్రారంభమవుతుంది. మొత్తం మీద భారతదేశ జనాభా 200 కోట్లు లోపుగానే ఉండవచ్చునని అన్ని అంచనాలు చెప్తున్నాయి.

సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడానికి కారణాలేమిటంటే, అభివృద్ధి, విద్యా స్థాయులు పెరుగుతుండటమేనని చంద్రన్‌ చెప్పారు. మహిళలు విద్యావంతులవుతుండటంతో పెళ్లి, పిల్లల్ని కనడం, కుటుంబం పరిమాణంపై నిర్ణయాలు తీసుకోవడంపై వారి ప్రభావం పడుతున్నదని తెలిపారు. గర్భనిరోధక సాధనాలు అందుబాటులో ఉండటం, సంతానోత్పత్తిని నియంత్రించే పద్ధతులు విస్తృతంగా ఉండటం కూడా సంతానోత్పత్తి తగ్గుదల వేగవంతమవడానికి దోహదపడుతున్నదని చెప్పారు. 

ఈ రోజుల్లో దంపతులకు మెరుగైన సమాచారం అందుబాటులో ఉంటున్నదని, ఎప్పుడు, ఎందరు పిల్లల్ని కనాలో నియంత్రించుకుంటున్నారని తెలిపారు. ఆలస్యంగా పెళ్లి జరగడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, ముఖ్యంగా మహిళలు ఉన్నత చదువులు చదువుతుండటం, కెరీర్‌లో ఎదుగుతుండటం వంటి వాటి వల్ల పునరుత్పాదన విధానాలు మారుతున్నట్లు తెలిపారు.

అభివృద్ధి పెరిగితే, సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నదని, నిరక్షరాస్యుల్లో ఇప్పటికీ సంతానోత్పత్తి రేటు మూడు కంటే ఎక్కువగా ఉంటున్నదని, విద్యావంతుల్లో 1.5 నుంచి 1.8 ఉంటున్నదని చెప్పారు. కేరళ రాష్ట్రం 1987-1989 నాటికి పునఃభర్తీ రేటు 2.1ని సాధించిందని, ప్రస్తుతం ఇది 1.5కు పతనమైందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా టోటల్‌ ఫెర్టిలిటీ రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. 

ఆరోగ్య సంరక్షణ మెరుగుపడటంతో ఆయుష్షు పెరుగుతున్నదని, 60 ఏళ్లు పైబడి జీవిస్తున్నవారు పెరుగుతున్నారని తెలిపారు. యువత ఉపాధి కోసం వలస పోతుండటంతో వృద్ధుల సంరక్షణ విషయంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వయోవృద్ధులకు డే కేర్‌ సర్వీసుల పట్ల ఆకర్షణ పెరుగుతున్నట్లు తెలిపారు.