ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రీజియన్ దంతెవాడ జిల్లాలో ఆదివారం మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 27 మందిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘లోన్ వర్రాటు’, ‘పూనా మర్గం’ పథకాలకు ఆకర్షితులై వారు లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు ఉన్నారు.
తాము హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని లొంగిపోయిన మావోయిస్టులు చెప్పారు. దంతెవాడలోని డీఆర్‌జీ కార్యాలయంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారుల సమక్షంలో వారు లొంగిపోయారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పాలసీ ప్రకారం తక్షణ సాయం కింద రూ.50 వేలు చొప్పున నగదు సాయం అందించనున్నారు. దక్షిణ బస్తార్‌లో మావోయిస్టుల ప్రాబల్యం గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతుందని ఎస్పీ తెలిపారు. ఈ భారీ లొంగుబాటు ఆ ప్రక్రియ దానికి మరింత వేగం తీసుకొచ్చిందని అధికారులు పేర్కొన్నారు. లొంగిపోయిన మిలీషియా సభ్యులు గతంలో పలు కీలక సంఘటనల్లో చురుకుగా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
వీరు గోంపడ్, జంగంపాల్, గుడ్రూమ్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టల కార్యకలాపాల్లో పాల్గొంటూ భద్రతాబలగాల కదలికలను గమనించడం, 2019, 2020ల్లో పోలీసులు, భద్రతా బలగాలపై దాడులు, కాల్పులు, అలాగే ఐఈడిలు అమర్చడం వంటి ఘటనల్లో వీరికి ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందని వివరించారు.

More Stories
ఇళ్లల్లో మాతృభాష, సంస్కృతం వాడకం తగ్గడం ఆందోళనకరం
కాంగ్రెస్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లను విస్మరించింది
రాంచీలో కోహ్లీ విశ్వరూపం.. సచిన్ ‘ఆల్టైమ్ రికార్డు’ బ్రేక్