అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని అధ్యక్షుడు ఐజక్ హట్జాగ్కు విజ్ఞప్తి చేశారు. ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. క్షమాభిక్ష కోసం ఆయన అధ్యక్ష కార్యాలయం న్యాయవిభాగానికి తన అభ్యర్థనను సమర్పించినట్లు తెలిపింది. నెతన్యాహు మూడు వేర్వేరు కేసుల్లో మోసం, నమ్మకద్రోహం, లంచాలు స్వీకరించడం వంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఇజ్రాయెల్ చరిత్రలో విచారణకు హాజరైన ఏకైక ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. సంపన్న రాజకీయ మద్దతుదారులకు ఆయన అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన ఇంకా ఏ కేసులోనూ దోషిగా తేలలేదు. ఆయన కూడా మొదటినుంచి ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. తనపై విచారణ విషయంలో దేశం ముక్కలుగా విడిపోయిందన్న నెతన్యాహూ, క్షమాభిక్ష ప్రసాదిస్తే దేశ ఐక్యత కోసం పోరాడుతానని పేర్కొన్నారు.
ఈ క్షమాభిక్ష అభ్యర్థన దేశీయ రాజకీయాల్లోనే కాక అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల ప్రారంభంలోనే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్కి ఒక లేఖ రాసి, నెతన్యాహును క్షమించాలన్న అభ్యర్థన చేయడం కేసు చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ట్రంప్, నెతన్యాహు మధ్య సుదీర్ఘకాల మైత్రి, రాజకీయ అనుబంధం ఉండటంతో, ఈ లేఖ అంతర్జాతీయ పరిశీలకుల్లో కొత్త ప్రశ్నలు రేపుతోంది.
ఒక దేశ నాయకుడి న్యాయపరమైన వ్యవహారాల్లో విదేశీ నాయకుడు జోక్యం చేసుకోవడం చాలా అరుదైన విషయం. ఇది ప్రపంచవ్యాప్తంగా మీడియా ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ప్రెసిడెంట్ హెర్జోగ్, న్యాయ నిపుణుల అభిప్రాయాలు, ప్రజాభిప్రాయం వంటి అంశాలన్నింటినీ సమీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అధ్యక్ష కార్యాలయం దీనిని అసాధారణ అభ్యర్థనగా పేర్కొంది. ఇది అనేక చిక్కులతో ముడిపడి ఉందని తెలిపింది.ఈ నిర్ణయం ఇజ్రాయెల్ రాజకీయ భవిష్యత్తుపై గణనీయ ప్రభావం చూపవచ్చు.
మరోవైపు ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మరణించినవారి సంఖ్య 70,000 దాటిందని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుప్రతి వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి అక్టోబర్ 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కానీ మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం గమనార్హం.

More Stories
విమానం కూలి లిబియా సైన్యాధిపతి మృతి!
హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు
అమెరికా నుండి వెళ్ళిపోతే రూ.2.68 లక్షల స్టైపెండ్