కేఐఐఎఫ్బీ మసాలా బాండ్ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్, సీఎం ప్రధాన కార్యదర్శి కేఎం అబ్రహంలకు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు అవసరం లేని ఈ నోటీసును విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ప్రకారం ఈడీ 10-12 రోజుల క్రితం జారీ చేసింది. ఈ నోటీసుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రత్యక్షంగా లేదా ప్రతినిధి ద్వారా సమాధానం ఇస్తే సరిపోతుంది.
మసాలా బాండ్ లావాదేవీలో రూ.466 కోట్ల విదేశీ మారక ద్రవ్య నియమాల ఉల్లంఘన జరిగినట్లు ఈడీ గుర్తించింది. కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ బోర్డ్ (కేఐఐఎఫ్ బీ) అనేది కేరళ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం నిధులు సేకరించే ప్రభుత్వ సంస్థ. రాష్ట్రంలోని పెద్ద, కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి రూ. 50,000 కోట్లను సమీకరించే ప్రణాళికలో భాగంగా 2019లో తొలి మసాలా బాండ్ జారీ ద్వారా రూ. 2,150 కోట్లు సేకరించారు.
అయితే 2019లో విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘిస్తూ, మసాలా బాండ్ ద్వారా నిధులను సేకరించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ షోకాజ్ నోటీసులు కేఐఐఎఫ్బీ నిధుల సేకరణ విధానంపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కాగా, ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే ఈడీ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్కు రెండు సార్లు గతంలో నోటీసులు జారీ చేసింది.
గతంలో కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. వీణ నిర్వహిస్తున్న ఐటీ సంస్థకు ఓ ప్రైవేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందనే ఆరోపణలతో ఈ కేసు నమోదైనట్లు ఈడీ అధికారులు తెలిపారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని వీణ సంస్థపై, మరికొందరిపై పీఎంఎల్ఏ కేసును ఈడీ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి.

More Stories
లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం భగల్ కుమారుడికి రూ. 250 కోట్లు
‘వికసిత్ భారత్ 2047’లో వాణిజ్య ఒప్పందాలు కీలకం
భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం