ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురి అరెస్టు

ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురి అరెస్టు
పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు కొనసాగిస్తున్న ముగ్గురిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. ఉత్తర భారత్ లో ఉంటున్న ఈ ముగ్గురికి ఐఎస్ఐ అసోయేటెడ్ టెర్రరిస్ట్ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టు అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిలో ఒకరిని పంజాబ్‌కు చెందిన హరగుణ్‌ప్రీత్ సింగ్‌గా, రెండవ వ్యక్తిని మధ్యప్రదేశ్‌లోని దాటియాకు చెందిన వికాస్ ప్రజాపతిగా, మూడవ వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన ఆరిఫ్‌గా గుర్తించారు.
‘పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షెహజాద్ భట్టి‌ నేతృత్వంలోని టెర్రర్ మాడ్యూల్‌‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్టు చేశాం’ అని అడిషనల్ ఎస్పీ (స్పెషల్ సెల్) ప్రమోద్ కమార్ కుష్వాహ తెలిపారు. ‘అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు ఈనెల 25న గురుదాస్‌పూర్ సిటీ పోలీస్ స్టేషన్ ముందు హ్యాండ్ గ్రనేడ్ విసిరారు. షెహజాద్ భట్టి ఈ దాడిని నిర్వహించాడు.
పలు ప్రాంతాను టార్గెట్ చేసుకుని వీడియోగ్రఫీ, రెక్కీ జరిపి హ్యాండ్ గ్లనేడ్లు విసరుతుండం ఈ గ్రూప్ చేస్తుంటుంది’ అని కుష్వాహ వివరించారు. కాగా, పాకిస్థాన్ బేస్ట్ టెర్రర్ మాడ్యూల్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించడం గత రెండు నెలల్లో ఇది రెండవది. సెప్టెంబర్‌లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, సెంట్రల్ ఏజెన్సీలు పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి దేశంలో కీలక దాడులకు ప్లాన్ చేసిన టెర్రర్ మాడ్యూల్‌ గుట్టురట్టు చేసింది.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అషర్ డానిష్ అని జార్ఖండ్‌లోని రాంచీలో పట్టుబడ్డాడు. ముంబైకి చెందిన ఇద్దరు అనుమానితులు అఫ్తాబ్, సుఫియాన్‌లను దేశ రాజధానిలో అరెస్టు చేశారు. మరో అనుమానితుడు ముజాపాను తెలంగాణకు చెందిన వ్యక్తిగా అరెస్టు చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోయి, డజన్ల కొద్దీ గాయపడినప్పటి నుండి, దేశవ్యాప్తంగా భద్రతా దళాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.  వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి. శనివారం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన ఒక ఇమామ్, అతని సహచరులలో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపింది.
 
బిలాలీ మసీదు ఇమామ్ అయిన నిందితుడు మహ్మద్ ఆసిఫ్,  వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన అతని సహచరుడు నాజర్ కమల్‌లను ఢిల్లీ పేలుడుకు సంబంధించి శుక్రవారం రాత్రి కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా, ఢిల్లీ పేలుడు కేసులో గతంలో పట్టుబడిన నలుగురు నిందితులు – ముజమ్మిల్ గనై, అదీల్ రాథర్, షహీనా సయీద్, మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ వాగే – శనివారం 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.