ప్రతీకారం తప్పదన్న హెజ్బొల్లా .. మరో యుద్ధం తప్పదా!

ప్రతీకారం తప్పదన్న హెజ్బొల్లా .. మరో యుద్ధం తప్పదా!
గాజాలో కాల్పుల మోతకు బ్రేక్ పడి పరిస్థితి కుదుటపడుతోన్న తరుణంలో ఇజ్రాయెల్, హెజ్బొల్లాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తమ కమాండర్‌ను చంపినందుకు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని హెజ్బొల్లా అధినేత నైమ్ ఖాసెమ్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో మరో యుద్ధం వచ్చే అవకాశం ఉందని, ఇజ్రాయెల్ బెదిరింపులకు లొంగబోమని ఆయన తెలిపారు.
ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంత కాలం ఆయుధాలను వదులుకునేది లేదని, పశ్చిమాసియాలో మరో యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందనే భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖాసెమ్ టెలివిజన్‌లో మాట్లాడారు.  దేశవ్యాప్తంగా ఆయుధ కేంద్రాలను వదిలిపెట్టాలనే ఇజ్రాయెల్ డిమాండ్‌ను హెజ్బొల్లా ఇప్పటికే చాలాసార్లు తిరస్కరించింద
నవంబరు 23న బీరుట్ శివారుల్లో జరిగిన దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్ హైదర్ అలీ తబ్తాబాయ్ మరణించారు. గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం తర్వాత హమాస్ కు మద్దతుగా హెజ్బొల్లా, యెమెన్ లోని హౌతీలు దాడులు చేసిన విషయం తెలిసిందే.    తమ ప్రతీకార చర్యల సమయాన్ని తామే నిర్ణయిస్తామని నయీమ్ ఖాసెమ్ చెప్పారు. ఇజ్రాయెల్ విస్తృత వైమానిక దాడులు చేస్తామనే బెదిరింపులకు తాము లొంగబోమనన్న ఆయన కొత్త యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 
‘యుద్ధాన్ని మీరు ఆశిస్తున్నారా? అయితే అది ఎప్పుడైనా సాధ్యమే. అవును, ఈ అవకాశం ఉంది, యుద్ధం రాకపోయే అవకాశం కూడా ఉంది’’ అని ఖాసెమ్ పేర్కొన్నారు.
ఘర్షణలపై తమ వైఖరి గురించి ఖాసెమ్ స్పష్టంగా చెప్పనప్పటికీ లెబనాన్ తన సైన్యం, ప్రజలపై ఆధారపడి ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోప్ లియో రాబోయే లెబనాన్ పర్యటన శాంతిని తీసుకురావడంలో, ఇజ్రాయెల్ దురాక్రమణను ముగించడంలో సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
అటు, హెజ్బొల్లా సహా దేశంలోని ఇతర మిలిటెంట్ గ్రూపులను త్వరగా నిరాయుధులను చేయాలని లెబనాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది.  ఈ క్రమంలో దేశ దక్షిణ ప్రాంతంలో హెజ్బొల్లా ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి లెబనాన్ సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సరిపోవని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవిచాయ్ అడ్రీ వ్యాఖ్యానించారు. ఖాసెమ్ ప్రసంగం ముగిసిన కాసేపటికే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
‘‘హెజ్బొల్లా మోసం చేస్తూ, తమ ఆయుధాలను రహస్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది’ అని అడ్రీ ఎక్స్ (ట్విట్టర్)లో ఆరోపించారు. అయితే, ఇజ్రాయెల్ తన దాడులు, ఆక్రమణలను కొనసాగిస్తున్నంత కాలం ఆయుధాలను వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని హెజ్బొల్లా స్పష్టం చేసింది.