ఒకేసారి 6వేల విమానాలను రీకాల్‌ చేసిన ఎయిర్‌ బస్‌..!

ఒకేసారి 6వేల విమానాలను రీకాల్‌ చేసిన ఎయిర్‌ బస్‌..!

ఫ్రెంచ్‌ దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్‌ బస్‌ కంపెనీకి చెందిన ఏ-320 సిరీస్‌లోని 6వేల విమానాల్లో సాంకేతిక లోపాల కారణంగా రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద రీకాల్ కావడం విశేషం.  ఒకేసారి పెద్ద సంఖ్యలో విమానాలను గ్రౌండింగ్‌ చేయడం వల్ల విమానాల షెడ్యూల్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్‌ భావిస్తున్నాయి. 

దాంతో ప్రయాణికుల జేబులు, సమయంపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నది. అయితే, అక్టోబర్‌ 30న అల్‌ జజీరాలో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం ఓ విమానం మెక్సికోలోని కాన్‌కూన్‌ నుంచి నూజెర్సీలోని న్యూవార్క్‌కు ప్రయాణిస్తోంది. అకస్మాత్తుగా విమానం వేగంగా కిందకు దిగింది.  ఆ తర్వాత విమానాన్ని ఫ్లోరిడాలోని టాంపాలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. 

ఆ సమయంలో ఎయిర్‌బస్ ఏ320 విమానాల్లో సాంకేతిక సమస్యపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మంచి పనితీరును కలిగిన ఉన్న ఎయిర్‌బస్‌ ఏ320 విమానాలు ప్రస్తుతం సాంకేతిక సమస్యల బారినపడ్డాయి. దీనిపై యూఎస్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ దర్యాప్తు చేపట్టింది. ఏ320 ఫ్యామిలీకి చెందిన విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సమస్యను సృష్టించిందని గుర్తించారు. 

ఎక్కువ సోలార్ రేడియేషన్ ఎక్కువగా ఉన్న సమయంలో ఎలివేటర్ అండ్ ఎలిరాన్ కంప్యూటర్లలోకి వెళుతున్న డేటాలో తప్పుడు ఉన్నట్లు తేలింది. దాంతో తప్పుడు కమాండ్స్‌ విమానానికి వెళ్తున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఎయిర్‌బస్‌ ప్రస్తుతం 11,300 ఏ320 విమానాలను నడుపుతుంది. కంపెనీ సుమారు 6వేల ఏ320 ఫ్యామిలీకి చెందిన విమానాలను రీకాల్‌ చేసింది. 

ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం విమానాలను వెనక్కి పిలుస్తుండగా తీవ్రమైన అంతరాయం కలిగే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ స్వభావం ఏ320 విమాన వెర్షన్‌పై ఆధారపడి ఉంటుంది. పాత వెర్షన్‌లకు వాటి ఈఎల్ఏసిని భర్తీ చేయాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సరిపోతుంది. ఏఎఫ్‌పీ ప్రకారం  చాలా విమానాలకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కొన్ని గంటలుపడుతుంది. 

కానీ, దాదాపు వెయ్యి విమానాలకు ప్రక్రియ వారాలు పడుతుందని తెలిపింది. ఈ వ్యవస్థ విమానాలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను తీసుకువచ్చామని, విమానయాన సంస్థలు వెంటనే తమ ఏ318, ఏ319, ఏ320, ఏ321 మోడల్ విమానాల్లో ఇన్టలేషన్ పూర్తి పూర్తి చేయాలని కంపెనీ సూచించింది.

విమానం రవాణాలో ఉంటే తర్వాత షెడ్యూల్‌కు ముందు పూర్తి చేయాలని, అప్‌డేట్‌కు కనీసం రెండుగంటల సమయం పడుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా పలు భారతీయ విమానాయాన సంస్థల్లో 200 నుంచి 250 వరకు ఏ320 క్లాస్‌కు చెందిన ఎయిర్‌ బస్‌ విమానాలు ఉన్నాయి. ఈ విమానాల్లో సమస్యను పరిష్కరించేందుకు సాఫ్ట్‌వేర్‌ మార్పులు అవసరం కావడంతో, విమానాల కార్యకలాపాలు నిలిపివేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

భారత్‌లో ఇండిగో, ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఏ320 క్లాస్‌ విమానాలు నడుపుతున్నాయి. దేశీయ విమానయాన సంస్థలు భారత్‌లో దాదాపు 560 విమానాలను ఉపయోగిస్తున్నాయి. మార్పులు చేయాల్సిన విమానాల్లో ఏ320 సీఈవో, నియో ఉన్నాయి. దీనిపై ఇండిగో స్పందించింది. ‘ఎయిర్‌బస్ తన ఏ320 సిరీస్ విమానాలకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ గురించి కంపెనీకి తెలుసు. మా విమానాల్లో ఎక్కువ భాగం ఇవే. ఈ విషయంలో ఇండిగో ఎయిర్‌బస్‌తో కలిసి పనిచేస్తోంది’ అని పేర్కొంది.

‘ఎయిర్‌ హెచ్చరికలను అనుసరించి కంపెనీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మా విమానాల్లో ఎక్కువ భాగం ప్రభావితం కాలేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లకు ఎయిర్‌బస్ మార్గదర్శకాలు వర్తిస్తాయి. అందువల్ల, విమాన కార్యకలాపాలు ప్రభావితం కావొచ్చు. ఆలస్యం లేదంటే విమానాలు రద్దయ్యే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ప్రభావితమవుతారు’ అని పేర్కొంది. 

ఎయిర్‌ ఇండియా స్పందిస్తూ.. ‘ఏ320 సిరీస్ భాగాలకు సంబంధించి ఎయిర్‌బస్ ఆదేశాల గురించి కంపెనీకి తెలుసు. ఈ మార్పుల కారణంగా మా విమానాల్లో సాఫ్ట్‌వేర్‌-హార్డ్‌వేర్‌ మార్పులు జరుగుతాయి. మొత్తం విమానాల అంతటా అవసరమైన మార్పులు చేసే వరకు షెడ్యూల్ చేసిన విమానాల కార్యకలాపాలు ఆలస్యం అవుతాయి. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా చింతిస్తోంది’ అని పేర్కొంది.