విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు శుభవార్త. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై తీవ్రంగా దృష్టి సారించిన రామ్మోహన్ నాయుడు భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని, అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ ప్రత్యేక సడలింపు శుక్రవారం నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్‌లో తమతో పాటు తీసుకెళ్లవచ్చు. అయితే భక్తులందరూ ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించి, సూచించిన మార్గదర్శకాలను సమయానికి పాటించాలని రామ్మోహన్ నాయుడు సూచించారు.
శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో అయ్యప్పకు సమర్పించేందుకు పవిత్రమైన ‘ఇరుముడి’ (నెయ్యి, కొబ్బరికాయ, ఇతర పూజ సామగ్రి)ని దీక్షలో ఉన్న భక్తులు తీసుకెళ్తారు. అయితే, ప్రస్తుత నిబంధనల ప్రకారం, మండే స్వభావం ఉన్నందున కొబ్బరికాయలను క్యాబిన్ లగేజీలో (ప్రయాణికుడితోపాటు) తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని నవంబరు 28 నుంచి జనవరి 20 వరకు ఇరుముడిని తమతోపాటే క్యాబిన్‌లో తీసుకెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది.
ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియల విషయంలో అధికారుల సూచనలను కచ్చితంగా అనుసరించాలని, శబరిమల యాత్ర పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. అయ్యప్ప స్వామి భక్తుల దీక్ష, భక్తి, ఆచార వ్యవహారాల పట్ల గౌరవంతో తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమాన మార్గం ద్వారా శబరిమల చేరే భక్తులకు ప్రయాణ సౌలభ్యం కల్పిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

More Stories
దేశంలో 40 లక్షలే గన్ లైసెన్సులు
తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్ లో 73 లక్షల ఓట్ల తొలగింపు
హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్కు వాయిదా