తెలంగాణ కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్షుల ప్రకటన అగ్గికి ఆజ్యం పోసింది. రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ తొమ్మిది నెలల పాటు చేసిన కసరత్తు అంత బుట్టదాఖలైన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే తొలి గుర్తింపు అని పాదయాత్రలో ఆమె ఇచ్చిన హామీ ఉత్త ముచ్చటగా మిగిలిపోయిందని వాపోస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఆరోపించినట్టు అసలు కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు లేకుండా, రేవంత్ అసలు కాంగ్రెస్ నేతలను పక్కకునెట్టి తన వర్గం నేతలకు పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకుండా, కులసమీకరణ సమతులనం లేకుండా డీసీసీ పదవులు కేటాయించారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఆగస్టులో జనహిత పేరిట పాదయాత్ర చేపట్టిన మీనాక్షీ నటరాజన్, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలను సేకరించి నివేదికలు రూపొందించారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జిల్లాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులతో భేటీ అయ్యారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన నేతల వివరాలు సేకరించారు. ఏఐసీసీ అబ్జర్వర్లను తెలంగాణకు రప్పించి క్షేత్రస్థాయి పరిశీలన చేయించారు.
పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని, టీపీసీసీ అధ్యక్షుడితో కలిసి డీసీసీ అధ్యక్ష పదవికి అర్హులైన అభ్యర్థుల జాబితాను రూపొందించినట్టు తెలిసింది. ప్రతిపోస్టుకూ ఇద్దరు నేతలను సిఫారసు చేస్తూ ఆమె ఏఐసీసీకి నివేదిక పంపినట్టు తెలిసింది. ఆమె సిఫారసు చేసిన పేర్లలో 90 శాతం మందికి డీసీసీ అధ్యక్ష పదవి రాలేదని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
చివరి నిమిషంలో సీఎం రేవంత్‌రంగ ప్రవేశం చేసి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోడ్పాటుతో తన వర్గం నేతలకే పదవులు ఇప్పించుకున్నట్టు తెలిసింది.ఒక పోస్టుకు ఒకరే ఉండాలని చెప్తే, ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు, 12 మంది పార్టీ వైస్ ప్రెసిడెంట్లకు డీసీసీల్లో చోటు కల్పించారు. అధ్యక్షులుగా చేసినవారు స్వచ్ఛందంగా తప్పుకోవాలనే నిబంధన పెట్టినా నాగర్‌కర్నూల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణకే మళ్లీ అవకాశమిచ్చారు. డీసీసీలుగా ఉన్న వారి కు టుంబ సభ్యులకు అవకాశం లేదని చెప్పినా సిద్దిపేట డీసీసీ పోస్ట్‌ను ఇప్పటివరకున్న అధ్యక్షుడు నర్సారెడ్డి కూతురు ఆంక్షారెడ్డికి ఇచ్చారు.
నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి నియామకంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పున్నా కైలాశ్ నేతకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. తనను, తన కుటుంబసభ్యులను కైలాశ్ అసభ్య పదజాలంతో దూషించారని నల్లగొండ పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. అతడిని తక్షణం పదవి నుంచి తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఇదే లేఖను మంత్రి కార్యాలయం మీడియాకు పంపింది.
డీసీసీ పదవి ఆశించి భంగపడిన గుమ్మల మోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి నమ్మించి తన గొంతు కోశారని ఆవేదన వ్యక్తంచేశారు. జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీరెడ్డి ఆశించారు. వీరిద్దరికీ కాకుండా కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న లకావత్ ధన్వంతికి జనగామ డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది.
More Stories
బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ పై పట్టుకోసం బిజెపి
రాజధానిని గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
సిగాచీ పరిశ్రమ పేలుడు దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం