డిసెంబ‌ర్ 4,5 తేదీల్లో భారత్ లో పుతిన్ పర్యటన

డిసెంబ‌ర్ 4,5 తేదీల్లో భారత్ లో పుతిన్ పర్యటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్​లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ 23వ ఇండియా–రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. పుతిన్ భారత పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని ఎంఈఏ పేర్కొంది. 
 
రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు అమలు చేస్తోన్న సమయంలో పుతిన్‌ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన మన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీ-పుతిన్‌ ద్వైపాక్షికంగా భేటీ కానున్నారు. ఆయన గౌరవార్థం భారత రాష్ర్టపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 
 
పుతిన్‌ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రష్యా ఆర్థిక వ్యవస్థకు భవన నిర్మాణం, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, జౌళి రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో 70వేల మందికి పైగా భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

“రష్యా అధ్యక్షుడు పుతిన్​ భారత పర్యటన ఇరుదేశాలకు ముఖ్యమైంది. రష్యా- భారత్​ సంబంధాలపై కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు రాజకీయ, వాణిజ్య, శాస్త్రసాంకేతిక, సాంస్కృతిక రంగాల అభివృద్ధిపై సమగ్రంపై చర్చించనున్నారు. ఇంకా వీటితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపైన చర్చించనున్నారు. అన్ని కీలక అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బృందంతో పుతిన్​ చర్చలు జరపనున్నారు” అని రష్యా అధికార మీడియా పేర్కొంది.

2021 తర్వాత పుతిన్‌ భారత్‌కు మళ్లీ ఇప్పుడే వస్తున్నారు. గతేడాది ప్రధాని మోదీ, పుతిన్‌ రెండుసార్లు భేటీ అయ్యారు. 2024 జులైలో ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ రష్యాకు వెళ్లారు. ఆ సందర్భంలో ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ అందుకున్నారు. 

అదే ఏడాది అక్టోబర్‌లో బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా రష్యాలోని కజాన్‌లో వీరిద్దరూ మరోసారి సమావేశమయ్యారు. ఇక, ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్‌-మోదీ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్ సి ఓ) దేశాధినేతల మండలి సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ భేటీ అయ్యారు. 

అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్‌ సన్నిహితుడు నికోలాయ్‌ పాత్రుషేవ్‌ కూడా సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఆ సమయంలో చర్చించారు.