బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కళ్యాణ్ నాయక్ రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ (జిసిసి)లో పెరుగుతున్న అవినీతి, అక్రమాలపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంబంధిత ఉన్నతాధికారులపై తక్షణ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిసిసి అటవీ ఉత్పత్తులు కొనడం మానేసిందని, గిరిజనుల జీవనాధారాన్ని కత్తిరించిందని ధ్వజమెత్తారు.
“చింతపండు, ఇప్పపువ్వు, ఇతర అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం జిసిసికి ప్రాథమిక బాధ్యత. కానీ ఇప్పుడు షెడ్లు ఖాళీ… కొనుగోలు లేదు… పరిశీలన లేదు… గిరిజనులు మాత్రం తమ సొంత నేలలోనే బానిసలుగా మారారు” అంటూ డా. కళ్యాణ్ నాయక్ మండిపడ్డారు. అటవీ ఉత్పత్తుల కొనుగోలు పూర్తిగా విఫలమవడం వల్ల గిరిజన కుటుంబాలు దళారీల పెనవేసుకుపోయిన పరిస్థితుల్లో బానిసల మాదిరిగా మిగిలిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రాండింగ్, మార్కెటింగ్ పేరే లేకుండా పోయిందని తెలిపారు. “కొనుగోలు చేసిన అటవీ ఉత్పత్తులను బ్రాండింగ్ చేసి మార్కెట్లో విక్రయించడం జిసిసికి అప్పగించిన బాధ్యత. ఇప్పుడు బ్రాండింగ్ లేదు… మార్కెటింగ్ లేదు… గిరిజనుల కోసం మార్కెట్ రక్షణ లేదు” అని విమర్శించారు. దళారి వ్యాపారస్తుల చేతుల్లో గిరిజనులు నలిగిపోతుంటే, వారిని కాపాడాల్సిన జిసిసి అధికారులు రాకెట్లకు దళారిలా మారిపోయారని, ఇది అధికార–దళారి కుమ్మక్కు అయ్యారని అంటూ ఆయన ఆరోపించారు.
పెట్రోల్ బంకులు కూడా అవినీతి గూట్లుగా మారి నిధులు ఆవిరవుతున్నాయని తెలిపారు. జిసిసికి ఆదాయ వనరులుగా ఉండాల్సిన పెట్రోల్ బంకుల్లో భారీ అవినీతి జరుగుతోందని ఆయన విమర్శించారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన సంస్థలో ప్రజా ధనాన్ని ఇంత బహిరంగంగా లూటీ చేస్తుండటం భారత్‌లోనే అరుదని చెబుతూ జిసిసి–ట్రైబల్ డిపార్ట్మెంట్ అవినీతి ముఠాల చేతుల్లో పూర్తిగా బంధీ అయిందని విచారం వ్యక్తం చేశారు.
దీనిపై విచారణకు స్వతంత్ర విచారణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, బాధ్యులందరినీ సస్పెండ్ చేసి, దళారీలతో కుమ్మక్కైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనుల చెమట, కష్టం, అస్తిత్వంతో ఆడుకోవడం ఎవరికీ హక్కు లేదని పేర్కొంటూ అవినీతి పాలు పంచుకుంటున్న అధికారులెవరైనా కావొచ్చు వారి మీద కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గిరిజనుల ధనాన్ని దోచిన ప్రతి ఒక్కరినీ బయటపెట్టి, గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More Stories
దేశంలో లక్ష మల్టీపర్పస్ సహకార సంఘాలు అవసరం
బీజేపీలో చేరిన సినీ నటి ఆమని
సిడ్నీ పేలుడుకు తెలంగాణతో సంబంధం లేదు