హైదరాబాద్‌లో శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రారంభించిన ప్రధాని

హైదరాబాద్‌లో శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రారంభించిన ప్రధాని

హైదరాబాద్‌లో ఫ్రెంచ్ కంపెనీ శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగిస్తూ శాఫ్రాన్‌ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. కొన్నేళ్లుగా ఏవియేషన్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.  ఇప్పటికే భారత్‌ 1500 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్‌ ఇచ్చిందని, ఎయిర్‌క్రాఫ్ట్‌ల సర్వీస్‌ సెంటర్‌ భారత్‌లో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమని ప్రధాని చెప్పారు.

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళుతున్నామని చెబుతూ కొన్ని రంగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు ప్రధాని చెప్పారు. శాఫ్రాన్‌ సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇది నగర అభివఅద్ధికి మరింత దోహదం చేస్తుందని చెబుతూ ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోందని హర్షాన్ని వ్యక్తం చేశారు. 

బెంగళూరు -హైదరాబాద్‌ను రక్షణ మరియు ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఏవియేషన్‌ రంగానికి చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్నాయని, ఎంతో మంది నిపుణులు ఇక్కడ ఉన్నారని తెలిపారు.  శాఫ్రాన్‌ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం భరోసానిచ్చారు.

 శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. దీని వల్ల ఆ లాభం ప్రయాణికులకు కూడా బదిలీ అవుతుందని తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ కోసం సింగపూర్‌, మలేషియా వంటి దేశాలపై అధికంగా ఆధారపడుతున్నట్లు వెల్లడించారు. 

భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ప్రారంభం కావడం సంతోషకరమని చెబుతూ  ప్రధాని మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ వల్లే ఇది సాధ్యమవుతోందని చెప్పారు. హైదరాబాద్‌ నగరం ఏవియేషన్‌ హబ్‌గా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.