కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్లు చట్టాల్లో గణనీయమైన మార్పులను తీసుకురానున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా తెలిపారు. నూతన కార్మిక చట్టాల వల్ల ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా శాశ్వత ఉద్యోగులతో పాటు సమాన ప్రయోజనాలను పొందునున్నారని చెప్పారు.
ఈ కొత్త కార్మిక కోడ్ల వల్ల కార్మికులు, యజమానులిద్దరికీ ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్మిక కోడ్లో ఉన్న ప్రాముఖ్యతను ఆయన వివరించారు. “ఇటీవల కాలంలో అత్యంత ముఖ్యమైన సంస్కరణల్లో ఇది ఒకటి. ఈ నూతన కోడ్లు అమల్లోకి రావడం వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే వెసులుబాటు పొందుతారు” అని చెప్పారు.
“అంతేకాకుండా పర్మినెంట్ ఉద్యోగుల వలే సెలవులు, వేతనాలు, భద్రతా హక్కులు, సెక్యూరిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏ రంగంలోనైనా, ఎంతమందినైనా నియమించుకునే అవకాశం ఉంది. దీంతో వారికి మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ సంస్కరణలు ఎంతో ఉపయోగపడుతాయి” అని ఆయన స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంస్కరణల్లో ఇది అత్యంత కీలకమైనదిగా రాజీవ్ అభివర్ణించారు. ‘ఇవి కేవలం 29 చట్టాలను ఏకీకృతం చేయడమే కాదు. సులభమైన, పారదర్శకమైన, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ’ అని తెలిపారు. ఇవి కార్మిక సంక్షేమాన్ని పెంపొందించడంలో, పెట్టుబడులు ఆకర్షించడంలో ఈ సంస్కరణలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అదే విధంగా ఈ నూతన కోడ్లు ఉద్యోగ నియామక ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు.
అపాయింట్మెంట్ లెటర్ తప్పనిసరి చేయడం, కనీస వేతనం నిర్ధరించడం, వేతనాలు సమయానికి చెల్లించడం, ఎక్కువ పనిగంటలకు తగిన వేతనం, సామాజిక భద్రత, మెరుగైన సౌకర్యాలు వంటి అనేక కార్మిక అనుకూలమైన సంస్కరణలను ఈ కొత్త నిబంధనల్లో పొందుపర్చినట్లు చెప్పారు.

More Stories
అయోధ్యలో ధ్వజారోహణంపై పాక్ అవాకులు
లైంగిక దాడి కేసులో కర్ణాటక మఠాధిపతి నిర్దోషి
రాజ్యాంగ విధులను నిర్వర్తించండి