లైంగిక దాడి కేసులో కర్ణాటక మఠాధిపతి నిర్దోషి

లైంగిక దాడి కేసులో కర్ణాటక మఠాధిపతి నిర్దోషి
బాలికలపై లైంగిక దాడుల కేసుల్లో మఠాధిపతికి కోర్టు ఊరట ఇచ్చింది. ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. సెషన్స్ కోర్టు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన శ్రీ మురుగ మఠం అధిపతి శివమూర్తి మురుగ శరణరుపై పలు ఆరోపణలు వచ్చాయి. 
 
కర్ణాటకలో చాలా శక్తివంతమైన లింగాయత్‌ మఠం నిర్వహిస్తున్న పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు ఆయన తమపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు. 2022 ఆగస్ట్‌లో మైసూరుకు చెందిన ఎన్డీవో సంస్థకు తమ గోడు వెల్లబోసుకున్నారు.  ఓడనాడి సేవా సంస్థ ఈ విషయాన్ని పిల్లల సంక్షేమ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. 

దీంతో ఆగస్టు 26న మైసూరులోని నజర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో మరో ఇద్దరితో సహా ఆ మఠాధిపతిపై పోక్సో కేసు నమోదైంది. మరునాడు చిత్రదుర్గ పోలీస్‌ స్టేషన్‌కు ఆ కేసును బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న శివమూర్తి మురుగ శరణరును పోలీసులు అరెస్ట్‌ చేశారు. 14 నెలలు జైలులో ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.మరోవైపు 2023 నవంబర్‌లో శివమూర్తి మురుగ శరణరు బెయిల్‌పై విడుదలయ్యాడు.

అయితే రెండో కేసుకు సంబంధించి నవంబర్ 20న పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. బెయిల్‌ ఉత్తర్వును సుప్రీంకోర్టు నిలిపివేసింది. లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. కాగా, శివమూర్తి మురుగ శరణరు తమపై మూడేళ్లుగా పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత బాలికలు ఆరోపించారు. అయితే దీనికి విరుద్ధంగా మెడికల్‌ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మఠాధిపతిపై నమోదైన రెండు పోక్సో కేసుల్లో ఆయనను నిర్దోషిగా సెషన్స్ కోర్టు పేర్కొంది. బుధవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.