బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో మూడు కేసుల్లో 21 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇప్పటికే మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో మరణశిక్ష విధించగా తాజాగా మరో మూడు అవినీతి కేసుల్లో ఆమెను దోషిగా తేల్చింది. పుర్బాచోల్‌లోని రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్ట్‌లోని ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ హసీనాపై మూడు కేసులు నమోదయ్యాయి.
వీటిపై విచారణ జరిపిన బంగ్లాదేశ్ కోర్టు, ఈ వ్యవహారంలో హసీనా అవినీతి పాల్పడినట్లు తేల్చింది. ఒక్కొక్క కేసులో ఏడేళ్ల శిక్ష ఖరారు చేస్తూ మెుత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు బంగ్లాదేశ్ కోర్టు తీర్పు ఇచ్చింది. గతేడాది జులైలో హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో నిరసనలను చెలరేగాయి. విద్యార్థుల నేతృత్వంలో చెలరేగిన ఆ తిరుగుబాటును అణిచివేసేందుకు హసీనా ప్రయత్నించారు.
ఈ క్రమంలో హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) ఇటీవల నిర్ధారించింది. ఈ మేరకు ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఆ నిరసనల్లో 1400 మంది మరణించగా, వేలాది మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. తనకు మరణ శిక్ష విధించడంపై హసీనా స్పందిస్తూ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని విమర్శించారు.
అయితే బంగ్లాదేశ్‌లో నిరసనలు జరుగుతున్న సమయంలో ఆమె దేశాన్ని విడిచి భారత్‌కు చేరుకొని ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు షేక్ హసీనాకు ఐసీటీ మరణ శిక్ష విధించడంపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందిస్తూ పొరుగు దేశంగా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం విషయంలో అన్ని పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
జనవరిలో షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ వేర్వేరుగా కేసులు నమోదు చేసింది. దీంతో కోర్టు షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్‌కు ఐదు సంవత్సరాలు, కుమార్తె సైమా వాజెద్ పుతుల్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. హసీనా భారత్ రావడంతో ఈ కేసును వాదించడానికి న్యాయవాది లేకుండా పోయారు.
అయితే అవినీతి ఆరోపణల్లో తమ ప్రమేయం లేదని హసీనా ఆమె కుటుంబ సభ్యులు వివిధ ప్రకటనల్లో ఇదివరకే పేర్కొన్నారు. షేక్ హసీనాకు తర్వాత బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.

More Stories
హాంకాంగ్‌లో ఏడు భవనాలకు మంటలు.. 55 మంది మృతి
వైట్‌హౌస్‌కు సమీపంలో కాల్పులు.. ఉగ్రదాడి!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను చంపేశారని పుకార్లు