ప్రపంచంలోనే తొలి యాంటీ-డ్రోన్‌ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్‌ రేంర్‌’

ప్రపంచంలోనే తొలి యాంటీ-డ్రోన్‌ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్‌ రేంర్‌’

ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్‌ యాంటీ-డ్రోన్‌ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్‌ రేంజర్‌’ను ఇంద్రజాల్‌ డ్రోన్‌ డిఫెన్స్‌ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ దేవేంద్ర ప్రతాప్‌ పాండే పాల్గొంటూ భవిష్యత్‌లో దేశాల మధ్య యుద్ధాలు కేవలం ఆయుధాలతో మాత్రమే ఉండవని, వీటిల్లో డ్రోన్స్‌ పాత్ర ఆందోళనకరంగా మారిందని విచారాన్ని వ్యక్తం చేశారు. 

దేశంలోకి పాకిస్థాన్‌ పలుమార్లు పంపిన డ్రోన్లను మన బలగాలు నిర్వీర్యం చేస్తున్నాయని చెబుతూ ‘ఇంద్రజాల్‌ రేంజర్‌’ అనే వాహనం అలాంటి అనుమానాస్పద డ్రోన్లను కూల్చుతుందని, ఇది చాలా కీలకమైన ముందడుగు అని వివరించారు. ఇంద్రజాల్‌ సంస్థను ప్రత్యేకంగా అభినందిస్తూ దేశ భద్రత విషయంలో ఇది కీలక పరిణామం అని ప్రతాప్‌ పాండే ప్రశంసించారు.

ఇంద్రజాల్‌ రేంజర్‌ ప్రారంభం కోసం 26/11 దాడి జరిగిన రోజును ఎంచుకోవడానికి కారణాన్ని ఇంద్రజాల్‌ డ్రోన్‌ డిఫెన్స్‌ ఇండియా సీఈవో కిరణ్‌ రాజు వివరించారు. 26/11 దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించేందుకే ఈ తేదీని ఎంచుకున్నట్లు చెప్పారు. 

”ఇక్కడ యువత డ్రగ్స్‌పై ఉపయోగించే నిధులు పాకిస్థాన్‌ ఉగ్ర ముఠాలకు వెళుతున్నాయి. ఇక్కడ చేసే తప్పులు.. సరిహద్దు రాష్ట్రాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. భారత్‌కు ఇతర దేశాలతో భూ సరిహద్దు 15 వేల కిలోమీటర్లు ఉంది. డ్రగ్‌ ట్రాఫికింగ్‌ పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్య నుంచి పుట్టిందే ఇంద్రజాల్‌ రేంజర్‌ వాహనం, యాంటీ డ్రోన్‌ పాట్రోల్‌ వెహికల్‌” అని తెలిపారు. 

“ఇది కేవలం డిఫెన్స్‌ డ్రోన్స్‌ కోసమే కాదు. దేశంలోకి డ్రగ్స్‌ తీసుకువస్తున్న డ్రోన్స్‌ను నిర్వీర్యం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని పరీక్షించిన సమయంలో 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసింది. ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుంది. హ్యాకింగ్‌ మెకానిజంతో సైబర్‌ ట్రిగ్గర్‌ విధానంలో ఇది వర్క్‌ చేస్తుంది” అని చెప్పారు. 

ఇందులోని సాఫ్ట్‌ స్కిల్‌ సిస్టమ్‌ డ్రోన్‌ను క్యాచ్‌ చేయడం గానీ లేదా క్రాష్‌ చేయడం గానీ చేస్తుందని కిరణ్ రాజు తెలిపారు. ఇంద్రజాల్‌ రేంజర్‌తో మనం ఆపే ప్రతీ డ్రోన్‌ మనుషుల ప్రాణాన్ని, మన భూమిని కాపాడుతుందని వివరించారు.