ఏపీలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు

ఏపీలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన అనంతరం మార్పు చేర్పులకు సీఎం ఆమోదం తెలిపారు.
కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకూ అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు, ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు కూడా హాజరైన ఈ సమావేశంలో, ఉపసంఘం సమర్పించిన నివేదికలో కొన్ని సవరణలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మార్పులన్నీ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం సుదూర ప్రయాణ భారాన్ని తగ్గించడం.
 
ఉదాహరణకు, మార్కాపురం జిల్లా ఏర్పాటుతో కనిగిరి, గిద్దలూరు, దర్శి ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు ప్రస్తుతం చేస్తున్న 200 కి.మీ. ప్రయాణం తగ్గుతుంది. అలాగే, మదనపల్లె జిల్లాలో అన్నమయ్య, చిత్తూరు జిల్లాల నుంచి మదనపల్లె, పిల్లేరు, పుంగనూరు, తంబలపల్లె మండలాలను కలుపుతారు.  పోలవరం జిల్లా ఏర్పాటు ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల ప్రజలకు 215 కి.మీ. దూర ప్రయాణం సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించారు.
ఈ మార్పులన్నిటితో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంలో సహాయపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.