పోలీసులు, దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉంటూ హింసకు గురికావడం, మరణించడం వంటి ఘటనలు వ్యవస్థకే మాయని మచ్చ అని మంగళవారం నాడు ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవస్థీకృత హింసకు తక్షణమే ముగింపు పలకాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉద్ఘాటించింది. ఇందు కోసం తగిన చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిన కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
పోలీసులు, దర్యాప్తు సంస్థల అధికారుల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించేలా అన్ని పోలీసు స్టేషన్లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఐదేళ్ల కిందటే తాము ఆదేశించినా నేటికీ ఏర్పాటు చేయకపోవడం సబబు కాదని ఆక్షేపించింది. కస్టడీ వేధింపులను నివారించేందుకు సిబిఐ, ఇడి, ఎన్ఐఎ వంటి కార్యాలయాల్లో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయాలని తామిచ్చిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇదంతా చూస్తుంటే కేంద్రం, న్యాయస్థానాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటోందని భావించాల్సి వస్తోందని పేర్కొంది. పోలీసు స్టేషన్లు, ఇంటరాగేట్ చేసే అధికారాలు కలిగిన కేంద్ర లా ఎన్‌ఫోర్స్‌్‌మెంట్ సంస్థల కార్యాలయాల్లో సిసిటివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఐదేళ్ళవుతోందని ధర్మాసనం గుర్తు చేసింది.
రాజస్థాన్‌లో 8 మాసాల్లో 11 కస్టడీ మరణాలు చోటు చేసుకున్నాయన్న వార్తలు రావడంతో కస్టడీలో క్రూరత్వం ఇంకా తగ్గలేదని తెలుసుకుని కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీంతో 2020లో ఇచ్చిన తమ తీర్పును కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏ మేరకు అమలు చేశాయో తెలుసుకోవడానికి తనకు తానుగా పున: పరిశీలించాలని బెంచ్ భావించింది.
మంగళవారం ఈ అంశాన్ని పరిశీలించగా కేవలం 11మంది మాత్రమే తమ సమ్మతి తెలుపుతూ నివేదికలు ఇచ్చారు, కేంద్రమైతే కనీసం దీనిపై ఏ రీతిలోనూ స్పందించలేదని వెల్లడైంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఎందుకు ఇంత తేలిగ్గా తీసుకుంటున్నారని జస్టిస్ నాథ్ ప్రశ్నించారు. కాగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ న్యాయస్థానాన్ని తేలిగ్గా తీసుకోవడమంటూ ఏమీ లేదని తిరస్కరించారు. త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. అఫిడవిట్ కాదు, సమ్మతిని తెలియచేసే నివేదిక అని జస్టిస్ మెహతా సరిదిద్దారు.

More Stories
క్రైస్తవ సైనికాధికారి తొలగింపుకు సుప్రీం సమర్ధన
జుబీన్ ప్రమాదంలో చనిపోలేదు.. హత్యకు గురయ్యారు
గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ.. సగం మంది ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్!